reliance: రిల‌య‌న్స్ జియో మ‌రో రికార్డు!

  • 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో ఆల్‌టైమ్ రికార్డు
  • అక్టోబర్‌ నెలలో జియో 21.9 ఎంబీపీఎస్‌ సగటు వేగం
  • మేలో 19.123 ఎంబీపీఎస్ వేగాన్ని న‌మోదు చేసిన జియో

ఉచిత మంత్రంతో టెలికాం రంగంలోకి ప్ర‌వేశించి ఊహించ‌ని రీతిలో వినియోగ‌దారుల‌ను సొంతం చేసుకున్న రిల‌య‌న్స్ జియో 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లోనూ అదే దూకుడు క‌న‌బ‌రుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో జియో 21.9 ఎంబీపీఎస్‌ సగటు వేగాన్ని నమోదు చేసిందని, ఇది ఆల్‌టైమ్ రికార్డ‌ని ట్రాయ్ చెప్పింది.

ఈ ఏడాది మే నెలలో జియో 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌ 19.123 ఎంబీపీఎస్ గా న‌మోదైంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అదే అత్య‌ధిక 4జీ డౌన్‌లోడ్ స్పీడుగా ఉంది. కాగా, ఈ జాబితాలో వొడాఫోన్‌ 8.7 ఎంబీపీఎస్‌ వేగంతో జియో త‌రువాతి స్థానంలో ఉండ‌గా, 8.6 ఎంబీపీఎస్‌తో ఐడియా, 7.5 ఎంబీపీఎస్‌ వేగంతో ఎయిర్‌టెల్ వరుస‌గా ఉన్నాయి.

ఇక 4జీ డౌన్‌లోడ్ వేగంలో జియో టాప్ ప్లేస్‌లో నిలిస్తే అప్‌లోడ్‌ వేగంలో ఐడియా ఆ స్థానాన్ని ఆక్ర‌మించింది. ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో ఐడియా 6.4 ఎంబీపీఎస్‌ సగటు వేగాన్ని నమోదు చేయ‌గా, ఆ త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా 5.9 ఎంబీపీఎస్‌తో వొడాఫోన్‌, 4.1 ఎంబీపీఎస్‌తో జియో, 3.5 ఎంబీపీఎస్‌తో ఎయిర్‌టెల్ ఉన్నాయి.    

More Telugu News