savrav ganguly: ఒకప్పుడు లక్ష్మణ్, భజ్జీ ఉన్నారన్న ధైర్యంతో ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లేవాళ్లం.. ఇప్పుడు కోహ్లీ వున్నాడు!: గంగూలీ

  • కోహ్లీ అందరికి రోల్ మోడల్
  • ధోనీ జట్టుని మరింత ఉన్నతికి తీసుకెళ్లాడు
  • టీమిండియా ఒక్కో మెట్టు ఎక్కుతూ వృద్ధి చెందుతోంది

వీవీఎస్‌ లక్ష్మణ్‌, హర్భజన్‌ సింగ్‌ జట్టులో ఉన్నారన్న ధైర్యంతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేవాళ్లమని టీమిండియా దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఢిల్లీ టెస్టు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అలాంటి ఫీలింగ్ ఇప్పుడు కోహ్లీని చూస్తే కలుగుతోందని అన్నాడు. అయితే తాము క్రికెట్‌ ఆడే సమయంలో టీమిండియా ఆట, ఆలోచనలు వేరని ఆయన చెప్పాడు. ఆ తరువాత ధోనీ సారథ్యంలో జట్టును మరింత ముందుకు నడిపాడని గంగూలీ కొనియాడాడు.

అయితే భారత క్రికెట్‌ లో ఉన్న గొప్పదనం ఏమిటంటే... ఇక్కడ ప్రతి విభాగంలోనూ రోల్‌ మోడల్స్‌ ఉన్నారని తెలిపాడు. వారినుంచి స్పూర్తిని పొందుతూ భారత క్రికెట్ ఒక్కోమెట్టు ఎక్కుతూ వస్తోందని ఆయన తెలిపాడు. ఇప్పుడు అందరికీ రోల్ మోడల్ కోహ్లీ అని గంగూలీ చెప్పాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగే 2019 వరల్డ్ కప్ గెలిస్తే...కోహ్లీ ఆక్స్‌ ఫర్డ్‌ వీధుల్లో చొక్కా విప్పి ఆనందంగా తిరగాలని గంగూలీ చమత్కరించాడు. కాగా, నాట్ వెస్ట్ సిరీస్ గెలిచిన సందర్భంగా లార్డ్స్ లో గంగూలీ చొక్కా విప్పి గాల్లో తిప్పిన సంగతి తెలిసిందే. 

More Telugu News