Tamilnadu: విశాల్! నిర్మాతల మండలికి రాజీనామా చెయ్!: దర్శకుడు చేరన్ డిమాండ్

  • తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న విశాల్
  • ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
  • విశాల్ వల్ల నిర్మాతలు ఇబ్బంది పడే అవకాశం ఉంది

తమిళ దర్శకుడు, నటుడు చేరన్ తాజాగా హీరో విశాల్ పై విరుచుకుపడ్డాడు. చెన్నయ్ లోని ఆర్కే నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన విశాల్ పై ఆయన మండిపడుతూ ఘాటుగా విమర్శించాడు. నిర్మాతల మండలి అధ్యక్ష పదవిని అడ్డుపెట్టుకుని, విశాల్ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నాడని, దీనికి తాము ఒప్పుకోమని పేర్కొంటూ, తక్షణం అధ్యక్ష పదవికి విశాల్ రాజీనామా చేయాలని చేరన్ డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఆయన నిర్మాతల మండలికి ఓ లేఖ రాశాడు.

గతంలో నడిగర్ సంఘం ఎన్నికల్లో విజయం సాధించగానే డీఎంకే నేత కరుణానిధిని కలిసి ఆశీస్సులు అందుకున్న విశాల్‌... ఇప్పుడు ఎంజీఆర్, జయలలిత సమాధులకు నివాళులర్పించి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ ధాఖలు చేయడంలో వున్న ఆంతర్యం ఏంటని చేరన్ ప్రశ్నించారు. విశాల్ చర్యలతో నిర్మాతలు నడిరోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. విశాల్ పై వ్యతిరేకతతో ఇతర నిర్మాతలకు ప్రభుత్వం నుంచి సహాయం అందదని ఆయన ఆరోపించారు.

అలాగే నిర్మాతల మండలికి విశాల్ చేసిందేమీ లేదని ఆయన అన్నారు. విశాల్ నిజంగా నిర్మాతల మండలి శ్రేయస్సు కోరితే తక్షణం తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆర్కేనగర్ లో విశాల్ వ్యతిరేక పోరాటం మొదలు పెడతామని ఆయన హెచ్చరించారు.

More Telugu News