Kapu reservations: రగిలిన చిచ్చు... ఏపీలో కాపులకు రిజర్వేషన్లపై భగ్గుమంటున్న బీసీ సంఘాలు!

  • ఏపీలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు
  • అసెంబ్లీలో బిల్లు ఆమోదం 
  • వివిధ కలెక్టరేట్ల వద్ద నిరసనలు

ఏపీ అసెంబ్లీలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానాన్ని ఆమోదించడంపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. బీసీలకు అన్యాయం జరుగకుండా కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారో చెప్పాలంటూ, గుంటూరు, కాకినాడ, విజయవాడ సహా పలు ప్రాంతాల్లో బడుగులు రోడ్డెక్కారు. వివిధ జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనలకు దిగారు.

కాపులకు రిజర్వేషన్ అంశంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు గుంటూరులో ఆరోపించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులను తెచ్చి వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. తక్షణం ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, లేకుంటే తీవ్ర ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

కాకినాడలో నిర్వహించిన ఆందోళనలో పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు కూడా పాల్గొన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. విజయవాడలో జరిగిన ధర్నాలో  బీసీ ఇంటర్‌నేషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్వీ రావు పాల్గొన్నారు. రాజకీయ కారణాలతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, దీని కారణంగా వెనుకబడిన సామాజిక వర్గీయులు నష్టపోతారని, తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో చంద్రబాబు దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని నిరసనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

More Telugu News