warangal: వరంగల్ లో మాధురిపై యాసిడ్ దాడి చేసిన నిందితుల అరెస్టు!

  • వరంగల్ అర్బన్ లో ఆటోలో మాధురిపై దాడి
  • ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాధురి మృతి
  • నిందితులు చంద్రశేఖర్, రాకేష్, అనిల్ అరెస్టు

 నవంబర్ 29న వరంగల్‌ అర్బన్ లో వివాహిత మహిళ మాధురిపై యాసిడ్‌ దాడికి పాల్పడి, ఆమెను పొదల్లో వదిలిపెట్టిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడి సూత్రధారి చంద్రశేఖర్ తో పాటు అతని స్నేహితులు రాకేష్, అనిల్ ను జనగామ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం కేసు వివరాలు వెల్లడిస్తూ, ఈ కేసుపై బాధితురాలి తల్లి జనగామ జిల్లా జఫర్‌ గఢ్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారని అన్నారు. దీంతో దర్యాప్తు చేసి, నిందితులను అరెస్టు చేసి, విచారించగా నేరం అంగీకరించారని పోలీసులు తెలిపారు.

వరంగల్ లో పెట్రోల్‌ బంక్‌ లో పనిచేస్తున్న మాధురితో ఆటో డ్రైవర్‌ చంద్రశేఖర్‌ కు సాన్నిహిత్యం పెరిగిందని, ఇది ప్రేమగా మారడంతో వారిరువురూ వివాహం చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. అయితే గతంలో మాధురికి వివాహమైన విషయంతో పాటు, బిడ్డ ఉన్న విషయాన్ని దాచిపెట్టి వివాహం చేసుకుందని, దీంతో కక్ష పెంచుకున్న చంద్రశేఖర్ గత నెల 29న తన స్నేహితులు రాకేష్‌, అనిల్‌ తో కలిసి మాధురిని ఆటోలో తీసుకెళ్లి, కాళ్లు, చేతులు కట్టేసి ముఖంపై యాసిడ్ తో దాడి చేసి ఐనవోలు మండలం గరిమళ్లపల్లి గ్రామ శివారులో పొదల్లో వదిలేశారని తెలిపారు. దీంతో స్థానికులు ఆమెను చూసి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిందని వారు తెలిపారు. 

More Telugu News