paripoornananda: ఆ అవ్వ చేసిన ప‌నితో నేను వ‌చ్చే జ‌న్మ‌లో ఇదే తెలంగాణ భూమిపై జ‌న్మించాల‌ని కోరుకున్నాను: ప‌రిపూర్ణానంద‌

  • నేను వ‌స్తున్నాన‌ని ఓ పేద‌ అవ్వ తెలుసుకుంది
  • త‌న వ‌ద్ద ఉన్న అతి త‌క్కువ డ‌బ్బుతో పాలు కొనింది
  • అవి తోడు వేసి నాకు అన్నం పెట్టింది
  • ఇక ఎప్ప‌టికీ తెలంగాణ‌లోనే ఉండి పోవాల‌ని నిర్ణ‌యించుకున్నాను

త‌న‌కు మ‌రో జ‌న్మ అంటూ ఉంటే తెలంగాణ భూమిపైనే, ఓ మారుమూల ప‌ల్లెలో పుట్టాల‌ని కోరుకుంటున్నాన‌ని రాష్ట్రీయ హిందూ సేన వ్య‌వ‌స్థాప‌కులు ప‌రిపూర్ణానంద అన్నారు. ఈ రోజు కామారెడ్డి జిల్లాలో ప‌రిపూర్ణానంద‌ ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ చేసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ప‌రిపూర్ణానంద మాట్లాడుతూ... తెలంగాణ‌లోని ప్ర‌తి వ్య‌క్తికి త‌న ప్రాంతంపై ఎంతో ప్రేమ ఉందని అన్నారు. తాను తెలంగాణ‌లోనే  ఉండి పోవాల‌ని నిర్ణ‌యించుకున్నానని అన్నారు. తాను ఈ తెలంగాణ‌లోనే ఊపిరి వ‌దులుతానని చెప్పారు.  

మ‌ళ్లీ ఆ భగ‌వంతుడు త‌నకు జ‌న్మనిస్తే తెలంగాణ‌లోనే పుడ‌తానని అందుకు ఓ కార‌ణం కూడా ఉంద‌ని ప‌రిపూర్ణానంద‌ తెలిపారు. తాను తెలంగాణ‌లోని ప‌ల్లెల్లో తిరుగుతున్న‌ప్పుడు ఓ అవ్వ త‌న ప‌ట్ల చూపిన ప్రేమే అందుకు కార‌ణ‌మ‌ని చెప్పారు. తాను త‌మ ప్రాంతానికి వ‌స్తున్నాన‌ని ఓ పేద‌ అవ్వ తెలుసుకుంద‌ని, త‌న‌కు ఆహారం పెట్ట‌డానికి ఆమె వ‌ద్ద డ‌బ్బులు లేవ‌ని అన్నారు. ఉన్న త‌క్కువ డ‌బ్బుతో పాలు కొని, తోడు వేసి పెరుగు చేసి త‌న‌కు అన్నం పెట్టింద‌ని తెలిపారు. ఆ ఒక్క మాట‌కి తాను అన్నీ వ‌దిలి పారేసి ఇక్క‌డే బ‌తుకుతున్నానని ప‌రిపూర్ణానంద‌ చెప్పారు. ఎవ్వ‌రినైనా క‌డుపులో పెట్టి చూసుకునే ప్రాంతం ఇది అని వ్యాఖ్యానించారు. తాను ఎన్నో ప్రాంతాల‌ను తిరిగాన‌ని, అయితే త‌న‌కు తెలంగాణ‌లోనే ఉండాల‌ని అనిపించింద‌ని తెలిపారు.

కాగా, తెలంగాణ చ‌రిత్ర గురించి తెలుసుకోవాలంటే పుస్త‌కాలు చ‌దివితే స‌రిపోదని ప‌రిపూర్ణానంద అన్నారు. ప‌ల్లెల్లో తిర‌గాలని, మ‌న‌కు ఈ మ‌ట్టి చ‌రిత్ర తెలుస్తోందని, అటువంటి గొప్ప భూమి ఈ తెలంగాణ అని వ్యాఖ్యానించారు. అందుకే తెలంగాణ 1948లో స్వాతంత్ర్యం తెచ్చుకుంద‌ని, ఉనికి కోసం పోరాడి 2014లో మ‌రోసారి విజ‌యం సాధించింద‌ని అన్నారు. ఏ ప్రాంతం అయినా ఒకేసారి విజ‌యం సాధిస్తుంద‌ని, తెలంగాణ మాత్రం రెండు సార్లు విజ‌యాలు సాధించింద‌ని తెలిపారు. ఇప్పుడు మన నిజ‌మైన చ‌రిత్ర‌ను నిరూపించుకోవాలని, గ‌త వైభ‌వాన్ని సాధించుకోవాల‌ని అన్నారు. కొంద‌రు వ‌క్రీక‌రించిన‌ చ‌రిత్ర‌ను మ‌నం చెరిపేయాలని, అందుకోసం పోరాడ‌దామ‌ని పిలుపునిచ్చారు.    

More Telugu News