metro rail: మైత్రీవనం నుంచి నాగోల్ కు ప్రయాణం.. బస్సు, మెట్రోరైలు మధ్య తేడా ఇదే!

  • మైత్రీవనం నుంచి నాగోల్ కు మెట్రో ప్రయాణం 49 నిమిషాలు
  • టికెట్ వ్యయం 45 రూపాయలు
  • బస్సులో మైత్రీవనం నుంచి నాగోల్ కు గంటా ఐదు నిమిషాలు
  • మెట్రో బస్సులో టికెట్ వ్యయం 27 రూపాయలు

హైదరాబాదుకు మణిహారంగా పేర్కొనే మెట్రో రైలు ఈనెల 29 నుంచి అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మెట్రో రైలు ఎక్కేందుకు హైదరాబాదీలు ఉత్సాహం చూపిస్తున్నారు. తొలిరోజు మెట్రో రైలెక్కేందుకు ఉత్సాహం చూపిన ప్రజలు రెండోరోజు నీరుగారిపోతున్నారు. ఎల్ అండ్ టీ, రాష్ట్రప్రభుత్వం సంయుక్తంగా నిర్మించిన మెట్రోలో ధరలు ఆందోళన కలిగిస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు.  

 ఈ నేపథ్యంలో నగర వాసులు వివిధ ప్రాంతాలకు మెట్రో ప్రయాణ సమయం, చార్జీలను.. సిటీ బస్సులతో పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ మేరకు ఒక ప్రయాణికుడు పేర్కొన్న వివరాల ప్రకారం... అమీర్‌ పేట నుంచి నాగోలుకు మెట్రో రైలు ప్రయాణం 49 నిమిషాల సమయం పట్టగా, ఈ సమయానికి అయిన టికెట్ వ్యయం 45 రూపాయలు. అదే మెట్రో కార్డు తీసుకుని ఉంటే ఆ ధర 42 రూపాయలు.

ఇక ఇదే దూరాన్ని మెట్రో ఎక్స్‌ ప్రెస్‌ బస్సులో ప్రయాణిస్తే గంటా 5 నిమిషాలు పట్టింది. అంటే 15 నిమిషాలు అదనంగా ప్రయాణించాల్సి వచ్చింది. అయితే నాగోలు నుంచి అమీర్‌ పేటకు నేరుగా మెట్రో ఎక్స్‌ ప్రెస్‌ బస్సులు లేని కారణంగా నాగోలు నుంచి సికింద్రాబాద్‌ కు, అక్కడి నుంచి అమీర్‌ పేటకు వెళ్లాల్సి వస్తుంది.

 బస్సులు విరివిగా ఉండడంతో బస్సుకోసం పెద్దగా ఎదురు చూడాల్సిన అవసరం కలగలేదు. ఇకపోతే ఈ దూరానికి అయిన టికెట్ వ్యయం కేవలం (నాగోలు-సికింద్రాబాద్ కు 16 రూ, సికింద్రాబాద్-అమీర్ పేట్ కి 11 రూపాయలు) 27 రూపాయలు కావడం విశేషం. సికింద్రాబాదులో బస్సు మారేందుకు 4 నిమిషాలు, ప్యాట్నీ, ప్యారడైజ్‌ సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్‌ వల్ల 5 నిమిషాలు సమయం పడుతుంది. దీంతో పావుగంట అదనంగా సమయం పడుతోంది. కానీ టికెట్ వ్యత్యాసం మాత్రం భారీగా ఉండడం విశేషం. 

More Telugu News