Hyderabad: మొదలైన మెట్రో కష్టాలు.. జరిమానాలతో ప్రయాణికుల బెంబేలు!

  • అవగాహన లేమితో అష్టకష్టాలు
  • స్టేషన్‌లో నీళ్లు లేక, మరుగుదొడ్లు కనిపించక ఇక్కట్లు
  • పార్కింగ్‌లోని వాహనాలను తీసుకుపోయిన పోలీసులు

అట్టహాసంగా ప్రారంభమైన మెట్రోలో తొలి రోజు ఎంజాయ్ చేసిన భాగ్యనగరవాసులకు మలిరోజు చుక్కలు కనిపించాయి. మెట్రోలో ప్రయాణించి తొలి అనుభవాన్ని సొంతం చేసుకోవాలనుకునే యువతకు గురువారం చేదు అనుభవం ఎదురైంది. అవగాహన లేమితో అష్టకష్టాల పాలయ్యారు. తెలియక చేసిన పనికి జరిమానాలు కట్టి పర్సులు ఖాళీ చేసుకున్నారు. నిబంధనల విషయంలో అవగాహన లేమితోపాటు దిగాల్సిన చోట రద్దీ కారణంగా దిగలేకపోవడంతో నిలువుదోపిడీకి గురయ్యారు.

మెట్రోలోకి మంచినీళ్ల సీసాలు అనుమతించకపోవడం, స్టేషన్‌లో తాగునీటి, మరుగుదొడ్డి సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతం. పరిమితికి మించి లగేజీని అనుమతించకపోవడం పైనా ప్రయాణికుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. మెట్రో రైలులో ప్రయాణించాలని వచ్చిన చాలామంది చార్జీలకు భయపడి తిరిగి వెళ్లిపోవడం కనిపించింది. కొన్ని చోట్ల టికెట్ కౌంటర్లలోని కంప్యూటర్లు మొరాయించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మరికొన్ని చోట్ల  స్కానింగ్ యంత్రాలు పనిచేయలేదు.

అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, ఈఎస్ఐ, భరత్‌నగర్, బేగంపేట, ప్రకాశ్  నగర్, ప్యాట్నీ తదితర స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తమ వాహనాలు స్టేషన్ల వద్దే పార్క్ చేశారు. వీటిని పోలీసులు పట్టుకుపోయారు. తిరిగి వచ్చి చూసేసరికి తమ వాహనాలు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్లకు పరుగులు పెట్టారు.

More Telugu News