Narendra Modi: ప్రధాని మోదీని విమర్శిస్తూ వీడియో పోస్ట్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ!

  • భావ ప్రకటన స్వేచ్ఛను హరించే ప్రయత్నం జరుగుతోంది
  • తలలు నరకమంటున్నారు.. సినిమావాళ్ల భార్యలు తిరుగుబోతులంటున్నారు
  • ఇంత జరుగుతున్నా మీరు మౌనంగానే ఉన్నారు
  • మౌనం అంగీకారం అనుకోవాలా?

భారత ప్రధాని నరేంద్ర మోదీని సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సున్నితంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మన దేశానికి మంచి నాయకుడు కావాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీని పీఎంగా ఎన్నుకున్నామని... కానీ, మీ వ్యవహారశైలి చూస్తుంటే, మీరు కొంత మందికి మాత్రమే ప్రధాన మంత్రి అనే ఫీలింగ్ కలుగుతోందని వీడియోలో ఆయన అన్నారు. మీరు అలాంటివారు కాదనేది తమ గట్టి నమ్మకమని చెప్పారు. ఈ మధ్య కాలంలో సినిమాలపై ప్రతి ఒక్కరూ పడిపోతున్నారని... ముఖ్యంగా బీజేపీవాళ్లు అని అన్నారు. ఆ మధ్య కాలంలో 'ఉడ్తా పంజాబ్', నిన్న 'మెర్సల్', ఇప్పుడు 'పద్మావతి'... ఇలా ఎన్నో సినిమాలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమా క్రియేటివిటీని ఆపడానికి చేసే ప్రయత్నం, భావ ప్రకటన స్వేచ్ఛను ఆపే ప్రయత్నం ఓ వైపు జరుగుతుంటే, తమరు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారని... తమరి మౌనం దీన్ని సమర్థిస్తున్నట్టుగానే కనిపిస్తోందని తమ్మారెడ్డి అన్నారు. ఈ వ్యవహారంపై తమరు మాట్లాడితే బాగుంటుందని చెప్పారు. బీజేపీకి చెందిన ఎంపీలు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారని... సినిమావాళ్ల భార్యలంతా ఎవరితోనో వెళ్లిపోతున్నారంటూ ఓ ఎంపీ దారుణ వ్యాఖ్యలు చేశారని... ఇలాంటి వ్యాఖ్యలను విని, తమరు ఎలా కామ్ గా ఉంటున్నారని ప్రశ్నించారు. కొంతమంది తలకాయలు తీసేయమంటున్నారని, దీపికా పదుకునే ముక్కు కోసేయాలంటూ పిలుపునిచ్చారని... వీటన్నింటినీ చూస్తుంటే మనం మళ్లీ ఆటవిక సమాజానికి వెళ్తున్నట్టు అనిపిస్తోందని అన్నారు. తమరు యావత్ దేశానికి ప్రధాని అని... ఏ ఒక్క వర్గానికో కాదని గుర్తు చేశారు. దేశంలోని ప్రతి ఒక్కరినీ రక్షించే బాధ్యత తమరిపై ఉంది అని అన్నారు.

ఈ నేపథ్యంలో, జరుగుతున్న ఘటనలపై తమరు స్పందిస్తారని ఆశిస్తున్నానని తమ్మారెడ్డి చెప్పారు. 'గౌరీ లంకేష్ ను చంపినప్పుడు కొంతమంది సెలబ్రేట్ చేసుకున్నారని... ఇది ఎంతవరకు సబబు?' అని మాత్రమే నటుడు ప్రకాశ్ రాజ్ మిమ్మల్ని ఉద్దేశిస్తూ అడిగారని... దానికి ప్రకాశ్ ను అల్లకల్లోలం చేశారని అన్నారు. ప్రధాన మంత్రిని దేని గురించైనా ప్రశ్నించడం తప్పా మోదీ గారు? అని అన్నారు. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మనసులోని మాటను తమతో పంచుకుంటున్నారని... మా మనసులోని మాటను కూడా మీరు వింటే చాలా బాగుంటుందని భావిస్తున్నానని చెప్పారు. ఈ వీడియో మీ వరకు చేరుతుందనే నమ్మకం కూడా తనకు లేదని... ఎవరైనా తన భావనను మీకు చెబుతారనే చిన్న ఆశ మాత్రం ఉందని అన్నారు. 

More Telugu News