Bosnian Croat leader: ఐరాస కోర్టులో కలకలం... శిక్షను విని విషం తాగి మరణించిన బోస్నియా నేత!

  • బోస్నియా నేత స్లోబోడన్ ప్రల్జాక్ కు 20 ఏళ్ల జైలు శిక్ష
  • 'మీ తీర్పును నేను వ్యతిరేకిస్తున్నాను' అంటూ ప్రల్జాక్ కేకలు
  • ఆపై విషం తాగిన నేత, ఆసుపత్రిలో మృతి

యుద్ధ నేరాలకు పాల్పడ్డారన్న అభియోగంపై బోస్నియా నేత స్లోబోడన్ ప్రల్జాక్ కు యూఎన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రైబ్యునల్ 20 సంవత్సరాల శిక్షను విధించగా, తీర్పును తట్టుకోలేని ఆయన తాను తెచ్చుకున్న విషం తాగి ప్రాణాలు వదిలారు. 72 సంవత్సరాల ప్రల్జాక్, గతంలో యుద్ధ నేరాలకు పాల్పడ్డారన్న కేసులో విచారణ ముగిసిన తరువాత న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు. తీర్పు విన్న వెంటనే, "మీ తీర్పును నేను వ్యతిరేకిస్తున్నాను" అని పెద్దగా అరిచిన ప్రల్జాక్, ఓ ప్లాస్టిక్ కప్పులో ఉన్న ద్రవాన్ని తాగి కుప్పకూలారు. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారని క్రొయేషియా ప్రభుత్వ వార్తా సంస్థ 'హినా' వెల్లడించింది.

ప్రల్జాక్ తో పాటు మరో ఐదుగురు బోస్నియాలోని క్రోట్స్ నేతలకు 10 నుంచి 25 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ అంతకుముందు న్యాయమూర్తులు తీర్పిచ్చారు. 1990 దశకంలో యుగోస్లావియా రిపబ్లిక్ కొనసాగిన రోజుల్లో మూడు వర్గాల మధ్య వైషమ్యాలు తలెత్తగా, సుమారు లక్ష మందికి పైగా ప్రజలు మరణించారు. ఈ కేసు విచారణ సుదీర్ఘంగా సాగగా, నిందితులకు ఇంతకాలానికి శిక్ష పడింది. ఇక, ఈ తీర్పు వెలువడిన తరువాత క్రొయేషియాలో కలకలం చెలరేగింది. పార్లమెంట్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. చారిత్రక నిజాలను పక్కనబెట్టి తీర్పిచ్చారని అసెంబ్లీ స్పీకర్ జాగరెబ్ ఆరోపించారు. ఈ ఘటనపై డచ్ అధికారులు విచారణ ప్రారంభించినట్టు 'హినా' పేర్కొంది.

More Telugu News