అదే మాటను నా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం టీడీపీ నేతలకు ఉందా?: శ్రీకాంత్ రెడ్డి

30-11-2017 Thu 09:50
  • తనతో సంప్రదించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటా
  • పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకపోతున్నారు
తనతో సంప్రదించినట్టు టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని... అదే మాటను తన ముందుకు వచ్చి చెప్పే ధైర్యం వాళ్లకు ఉందా? అంటూ వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేయడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందని... ప్రతిసారీ వివరణ ఇచ్చుకోవడానికి తనకే సిగ్గుగా ఉందని అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు తాను జగన్ వెంటే నడుస్తానని... నీతి మాలిన రాజకీయాలను తాను చేయలేనని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడేలా కేవలం రెండు పేజీల మేనిఫెస్టోను తయారుచేస్తానని చెప్పిన గొప్ప నాయకుడు జగన్ అని కితాబిచ్చారు.

పాదయాత్రలో జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని... ఈ నేపథ్యంలో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రతి రోజు 14 నుంచి 16 కిలోమీటర్లు నడుస్తూ ప్రజల కష్టసుఖాలను జగన్ తెలుసుకుంటున్నారని చెప్పారు. వైసీపీ నుంచి పలువురు బయటకు వస్తున్నారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు.