Hyderabad: నాగోల్ నుంచి మియాపూర్ వ‌ర‌కు ఒక‌టే రైలు కాదు.. తెలియ‌క‌ ఇబ్బందులు.. ఫైన్ క‌డుతోన్న మెట్రోరైల్‌ ప్ర‌యాణికులు!

  • ఒకే మెట్రోరైల్లో నాగోల్ నుంచి మియాపూర్ వ‌ర‌కు వెళ్ల‌లేం
  • అమీర్‌పేట్‌లో మ‌రో రైల్ ఎక్కాలి
  • టికెట్‌ను మార్పించాలి.. లేదంటే ఫైన్‌
  • భ‌విష్య‌త్తులో ఒకే మెట్రోట్రైన్‌లో మియాపూర్ వ‌ర‌కు ప్ర‌యాణం

ఈ రోజు ప్రారంభ‌మైన మెట్రోరైలుకి హైదరాబాదీయుల నుంచి అనూహ్య స్పంద‌న వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. త‌క్కువ దూరాల‌కు వెళ్లాల‌నుకున్న వారు ఇబ్బందులేవీ లేకుండా ప్ర‌యాణిస్తున్నారు. కానీ, నాగోల్ లేక ఉప్ప‌ల్ నుంచి నేరుగా మియాపూర్‌కు వెళ్లాల‌నుకున్నవారు మాత్రం తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. ఎందుకంటే నాగోల్ నుంచి నేరుగా మియాపూర్‌కు ఒకే రైలు లేదు. మియాపూర్‌కి వెళ్లాల‌నుకునే వారు నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు ఒక ట్రైన్‌లో వెళ్లాల్సి ఉంటుంది.

అక్కడ దిగి, మ‌రో మెట్రో రైలు ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఒక‌వేళ‌ టిక్కెట్ మియాపూర్ వరకు తీసుకున్న‌ప్ప‌టికీ అమీర్‌పేటలో దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. కొంత మందికి ఈ విష‌యం తెలియ‌డం లేదు. అమీర్‌పేట్‌లో టికెట్ మార్చుకోకుండా మ‌రో ట్రైన్ ఎక్కేసి మియాపూర్‌లో దిగుతున్నారు. దీంతో వారు అక్కడ ఫైన్ కట్టాల్సి వస్తోంది. స్మార్ట్ కార్డు ఉన్నవాళ్లు కూడా అమీర్‌పేటలో దిగిన తరువాత మ‌రో రైలు ఎక్కేటపుడు తమ స్మార్ట్ కార్డ్‌ను  స్వైప్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో నాగోల్ నుంచి మియాపూర్ వరకూ ఒకే రైలు ఉంటుంద‌ని, మధ్యలో అమీర్ పేట్ ఇంటర్ ఛేంజ్ పాయింట్ అవ‌స‌రం అప్పుడు ఉండ‌బోద‌ని మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.    

More Telugu News