balka suman: ఆరుగురు పోలీసులు అప్ప‌ట్లో న‌న్ను ఎలా చిత‌క్కొట్టారో ఈ వీడియో చూడండి!: ఎంపీ బాల్క సుమ‌న్

  • నవంబరు 29, 2009లో తెలంగాణ కోసం కేసీఆర్ దీక్ష ప్రారంభం
  • తార్నాకలో భ‌గ్గుమ‌న్న విద్యార్థులు
  • లాఠీల‌తో బాల్క సుమ‌న్‌పై విరుచుకుప‌డ్డ ఆరుగురు పోలీసులు
  • ఆ వీడియో పోస్ట్ చేసిన స‌ద‌రు ఎంపీ

ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజు త‌న‌ను పోలీసులు చిత‌క్కొట్టార‌ని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమ‌న్ గుర్తు చేసుకున్నారు. నవంబరు 29, 2009 లో తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్‌ నిరాహారదీక్ష చేపట్టిన విష‌యం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ స‌ర్కారు కేసీఆర్‌ దీక్షను భగ్నంచేసి ఆయనను అరెస్టుచేసి రాత్రి వేళలో ఖమ్మం సబ్‌జైల్‌కు తరలించగా, నవంబరు 29, 30 తేదీలలో ఖమ్మం సబ్‌జైలులో ఆయ‌న ఉన్నారు. అదే స‌మ‌యంలో హైద‌రాబాద్ తార్నాక‌లోని ఉస్మానియా యూనివ‌ర్సిటీలో విద్యార్థులు భ‌గ్గుమ‌న్నారు.

కేసీఆర్‌కి మ‌ద్ద‌తుగా ఓయూలో ర్యాలీ చేప‌ట్టారు. అక్క‌డ‌కు భారీగా చేరుకున్న పోలీసులు ర్యాలీని అణ‌చివేశారు. ఈ సంద‌ర్భంగానే అప్ప‌టి విద్యార్థి నాయ‌కుడు బాల్క‌ సుమ‌న్‌ను ఆరుగురు పోలీసులు దాదాపు 30 లాఠీ దెబ్బ‌లు కొట్టారు. ఈ దృశ్యాలు అన్ని న్యూస్ ఛానెళ్ల‌లో వ‌చ్చాయి. అప్పుడు పోలీసులు త‌న‌ను తీవ్రంగా కొట్టార‌ని, ఆ రోజుని మ‌ర్చిపోలేన‌ని బాల్క‌సుమ‌న్ చెబుతూ ఆ వీడియోను త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.  

More Telugu News