kuwait: కువైట్ లో నా భార్యను రూ. 4 లక్షలకు అమ్మేశారు: వెంకయ్య, చంద్రబాబు, జగన్ లకు రమణయ్య లేఖలు

  • ఖతార్ వెళ్లాలనుకున్న రమణయ్య దంపతులు
  • భార్యను మాత్రమే కువైట్ కు పంపిన ఏజెంట్లు
  • కువైట్లో ఆమెను రూ. 4 లక్షలకు అమ్మేసిన మోసగాళ్లు

అందరిలాగానే గల్ఫ్ దేశాలకు వెళ్లి కాస్తో, కూస్తో సంపాదించుకుకోవాలన్న ఆశ... చివరకు వీరికి నరకయాతననే మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే, పల్లిపాటి రమణయ్య, పోలమ్మ భార్యాభర్తలు. వీరు గూడూరులోని పొట్టి శ్రీరాములు పార్క్ ప్రాంతంలో నివసిస్తుంటారు. మెరుగైన సంపాదన కోసం ఖతార్ కు వెళ్లాలని వీరు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో, ఈ ఏడాది జనవరిలో కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన గురవయ్య, శేషు, మస్తాన్ బాషా, అమరావతి అనే ఏజెంట్లను వీరు కలిశారు. తమను ఖతార్ పంపాలని కోరారు. రూ. లక్ష ఇవ్వాలని ఏజెంట్లు కోరగా... తమ ఇంటిని తాకట్టు పెట్టి నగదు చెల్లించారు.

ఆ తర్వాత పోలమ్మకు మాత్రమే వీసా వచ్చిందని రమణయ్యకు ఏజెంట్లు చెప్పారు. మరోవైపు, పోలమ్మను కూడా ఖతార్ కు కాకుండా కువైట్ కు పంపించారు. ఆ తర్వాత నాలుగు నెలల పాటు కొంత మొత్తాన్ని మాత్రమే తన భార్య తనకు పంపిందని రమణయ్య తెలిపాడు. ఆమె పని చేస్తున్న యజమాని డబ్బు ఇవ్వడం లేదని... ఆమెను ఏజెంట్లు రూ. 4 లక్షలకు అమ్మేశారని వాపోయాడు. రూ. 4 లక్షలు ఇస్తేనే తిరిగి పంపిస్తామని కువైట్ లో చెబుతున్నారని... ఇప్పటికే ఉన్న ఒక ఇంటిని తాకట్టు పెట్టిన తాను... ఇన్ని లక్షలను ఎక్కడ నుంచి తీసుకు రాగలనని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని, తన భార్యను తిరిగి రప్పించుకునేందుకు సహకారం అందించాలని కోరుతూ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ లకు ఆయన లేఖలు రాశాడు.

More Telugu News