India: భారత చరిత్ర, సంస్కృతి అంటే ఇష్టం.. హైదరాబాద్ లో ఇవాంకా తొలి మాటలు!

  • 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు ప్రత్యేక ఇంటర్వ్యూ
  • సుష్మాతో సమావేశాన్ని ప్రస్తావించిన ఇవాంకా
  • నరేంద్ర మోదీతో భేటీపై ఆసక్తి
  • మహిళల కోసం శ్రమిస్తున్న డొనాల్డ్ ట్రంప్, మోదీ

హైదరాబాద్ లో నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న జీఈఎస్ లో పాల్గొనేందుకు వచ్చిన ఇవాంకా ట్రంప్, తొలిసారిగా మాట్లాడారు. 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, భారత చరిత్ర, సంస్కృతి అంటే తనకు ఇష్టమని చెప్పారు. గతంలో విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ తో తాను న్యూయార్క్ లో సమావేశమైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మహిళల పురోగతిపై తన ఆశయాలను ఆమెకు చెప్పానని, నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయి, అవే అంశాలను మరోసారి మాట్లాడతానని చెప్పారు.

"ఇండియా, అమెరికాతోపాటు అన్ని దేశాల్లో పెట్టుబడి అవకాశాలను సృష్టించడంతో పాటు పౌరులందరికీ ఆర్థిక స్వావలంబన కల్పించడమే అతిపెద్ద సవాలు. అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత్‌ లో ప్రధాని నరేంద్రమోదీ ఈ దిశగా ఎంతో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల ప్రగతి కోసం శ్రమిస్తున్నారు" అని ఇవాంకా వ్యాఖ్యానించారు. జీఈఎస్ లో 50 శాతం మంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారని గుర్తు చేసిన ఆమె, వారి సత్తా చాటేందుకు ఇది సరైన అంతర్జాతీయ వేదికని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తే, ప్రగతి మరింత సులువవుతుందని చెప్పారు.

More Telugu News