GES: 1500 మంది అతిథులు ఫలక్ నుమాకు ఎలా..? పోలీసుల ముందు అతిపెద్ద సవాల్!

  • సాయంత్రం 5 గంటలకు సదస్సు ముగింపు.. 7.30లోగా ఫలక్ నుమాకు అతిథులు
  • తొలుత మోదీ, ఆపై ఇవాంకా, కేసీఆర్, కేంద్ర మంత్రుల కాన్వాయ్ లు
  • మిగతా అతిథుల కోసం 45 ప్రత్యేక బస్సులు సిద్ధం
  • మార్గమంతా ఖాళీగా ఉంచాలని పోలీసుల నిర్ణయం

170 దేశాల నుంచి హైదరాబాద్ సదస్సుకు అతిథులుగా వచ్చిన పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు... వీరి సంఖ్య దాదాపు 1500. వీరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు, వీఐపీలు అదనం. ఇంతమందికీ నేటి రాత్రి నగరంలోని ఫలక్ నుమా ప్యాలెస్ లో ఘనమైన విందును ప్రభుత్వం ఏర్పాటు చేయగా, సాయంత్రం 5 గంటల తరువాత వీరిని ఫలక్ నుమా ప్యాలెస్ కు ఎలా తరలించాలన్నది పోలీసుల ముందు అతిపెద్ద సవాల్ గా మారింది.

5 గంటలకు తొలి రోజు జీఈఎస్ సదస్సు ముగియనుండగా, ఆపై అతిథులను ఫలక్ నుమాకు తరలించేందుకు 45 బస్సులను ఏర్పాటు చేశారు. తొలుత నరేంద్ర మోదీ కాన్వాయ్, ఆ తరువాత ఇవాంకా కాన్వాయ్, ఆపై కేసీఆర్, కేంద్ర మంత్రుల కాన్వాయ్ లను అనుమతించి, అటు పిమ్మట అతిథులను తీసుకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం మాదాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు, రాజేంద్రనగర్, ఫలక్ నుమాకు వెళ్లే రహదారిని పూర్తిగా ఖాళీగా ఉంచాలని నిర్ణయించారు. ఈ మార్గంలో ప్రయాణానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పట్టే అవకాశాలు ఉండటంతో, నేటి సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు, ఆపై 9 నుంచి 11 గంటల మధ్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవు.

More Telugu News