Hyderabad: ఆ చివర నుంచి ఈ చివరి వరకు రైలు నడవాల్సిందే.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రెడీ అయిన మెట్రో రూటు!

  • ముఖ్యమంత్రి చొరవతోనే అందుబాటులోకి నాగోల్-మియాపూర్ లైన్
  • నాలుగు నెలలు రేయింబవళ్లు కష్టపడిన మెట్రో ఇంజినీర్లు, సిబ్బంది
  • నగరం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మెట్రో పరుగు

మెట్రో రైలు పట్టాలెక్కబోతోందని గత కొన్ని నెలలుగా వార్తలు హల్ ‌చల్ చేస్తున్నా నగరవాసుల ముఖాల్లో అప్పుడు సంతోషం కనిపించలేదు. నాగోలు నుంచి మెట్టుగూడ వరకు మాత్రమే మెట్రోను నడుపుతామని ప్రకటించడమే అందుకు కారణం. ఆ మాత్రానికి మెట్రో ఎందుకన్న విమర్శలూ వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మెట్రో అధికారులతో మాట్లాడి నగరంలోని ఆ చివర నుంచి ఈ చివరి వరకు ఉన్న మార్గంలో రైళ్లు తిప్పాల్సిందేనని, అందుకు కావాల్సిన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

నిజానికి నాగోలు నుంచి మియాపూర్ వరకు ఉన్న 30 కిలోమీటర్ల మెట్రో మార్గం ఒకే మార్గం కాదు. దీనిని రెండు కారిడార్లగా విభజించారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరుకానున్న మోదీ చేతుల మీదుగా మెట్రోను ప్రారంభించాలని ప్లాన్ చేసింది కూడా కేసీఆరే. అయితే పనులు పూర్తి అయ్యే సూచనలు కనిపించకపోవడంతో మియాపూర్ నుంచి ఎస్సార్ నగర్ వరకు 12 కిలోమీటర్లు, నాగోలు నుంచి బేగంపేట వరకు 16 కిలోమీటర్లు మాత్రమే పనులు పూర్తవుతాయని, మొత్తం మార్గంలో  తొలి విడతలో రైళ్లు నడపడం సాధ్యం కాదని అధికారులు తేల్చి చెప్పారు.

అందుకు అనుగుణంగానే పనులు చేపట్టారు. మెట్టుగూడ, మియాపూర్-ఎస్సార్ నగర్ మార్గాలు సిద్ధమై చాలా కాలం అయినా ప్రయాణికులకు పెద్దగా ప్రయోజనం ఉండదన్న కారణంతో ప్రారంభాన్ని వాయిదా వేశారు. మెట్రో పనులపై సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మెట్రోను సగం సగం నడపడం వల్ల ప్రయోజనం శూన్యమని అధికారులకు తేల్చి చెప్పారు. బేగంపేట-ఎస్సార్ నగర్ మార్గాన్ని అందుబాటులోకి తెస్తే నాగోలు నుంచి అమీర్‌పేట వరకు 17 కిలోమీటర్లు, మియాపూర్-అమీర్‌పేట మధ్య 13 కిలోమీటర్ల ప్రయాణం అనువుగా ఉంటుందని, ఈ మేరకు పనులు చేపట్టి అక్టోబరు నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. అందులో భాగంగా అమీర్‌పేటలో నిర్మించిన ఇంటర్ చేంజ్ స్టేషన్ పనులను త్వరితగతిన చేపట్టాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో కదిలిన మెట్రో అధికారులు ట్రాఫిక్‌ను మళ్లించి నాలుగు నెలలపాటు రాత్రింబవళ్లు శ్రమించి పనులను పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలు ఫలించి నాగోలు నుంచి మియాపూర్ వరకు రైల్వే లైను అందుబాటులోకి వచ్చింది. సీఎం కనుక ఆ ఆలోచన చేయకుంటే తొలి విడతలో సగం దూరం ప్రయాణానికే పరిమితమయ్యేది. ప్రజల కోణం నుంచి ఆలోచించిన కేసీఆర్ మొత్తానికి అనుకున్నది సాధించారు. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా మరికొన్ని గంటల్లో మెట్రో ప్రారంభం కానుంది. సో.. నగరవాసులారా.. బీరెడీ!

More Telugu News