Narendra Modi: జస్ట్... ఇప్పుడే చచ్చిపోయిన మోదీ ప్రియ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్య

  • త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు
  • మరోసారి నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
  • రఫాలే డీల్ ఏకపక్షం 
  • మోదీ సర్కారుపై విమర్శనాస్త్రాలు

ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి విరుచుకుపడ్డారు. మోదీ తన ప్రియాతి ప్రియమైన ప్రాజెక్టుగా చెప్పుకునే 'మేకిన్ ఇండియా' ఇప్పుడే చచ్చిపోయిందని అన్నారు. గుజరాత్ పన్ను చెల్లింపుదారులకు చెందిన 33 వేల కోట్ల రూపాయలు బూడిదగా మారాయని, ఇందుకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. రఫాలే యుద్ధ విమానాల కొనుగోలు డీల్ వెనక జరిగిన మతలబు ఏంటని మోదీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రశ్నించిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 "అరుణ్ జైట్లీ సుదీర్ఘ మీడియా సమావేశం పెట్టి చాలాసేపు రఫాలే డీల్ గురించి మాట్లాడారు. నేను ఒక్కటే అడుగుతున్నాను. ఆ విమానం కోసం ఆఫర్ చేసిన తొలి ధర ఎంత? ఇప్పుడు మీరు ఆఫర్ చేస్తున్న ధర ఎంత? యూపీఏ నిర్ణయించిన ధరకన్నా అది ఎక్కువా? తక్కువా?" అని రాహుల్ అడిగారు. విమానాల తయారీలో ఏడు దశాబ్దాల చరిత్ర ఉన్న హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ను ఎందుకు పక్కన బెట్టారని నిప్పులు చెరిగారు. రఫాలే ఫైటర్ జెట్ డీల్ విషయమై మోదీ ఏకపక్షంగా తుది నిర్ణయం తీసుకున్నారని రాహుల్ ఆరోపించారు. ఆయన నిర్ణయంతో మేకిన్ ఇండియా ఉద్దేశం చచ్చిపోయిందని, స్వదేశీ సంస్థలకు పెద్దపీట ఎక్కడ వేశారని అడిగారు.

More Telugu News