ivanka trump: ఇవాంక తుది మెనూను దగ్గరుండి ఖరారు చేయించిన కేటీఆర్... జాబితా ఇదే!

  • గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సదస్సుకు రానున్న ఇవాంకా
  • ఫలక్ నుమా ప్యాలెస్ లో విందు 
  • అతి కొద్ది మందికే ప్రవేశం.. ఏర్పాట్లు పూర్తి

మరో రెండు రోజుల్లో హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సులో అమెరికా తరఫున అధికారికంగా హాజరు కానున్న డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఇవాంకా ట్రంప్ కు ప్రఖ్యాత ఫలక్ నుమా ప్యాలెస్ లో తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనున్న విందు మెనూ సిద్ధమైంది. ఆమెకు మరపురాని ఆతిథ్యం ఇవ్వాలని భావించిన సర్కారు తరఫున మంత్రి కేటీఆర్ దగ్గరుండి మెనూను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా పేరున్న షెఫ్ లు ఈ వంటకాలను సిద్ధం చేయనున్నారు. మెనూలో ధమ్ కి బిర్యానీ, హలీం, షీక్ కబాబ్, మటన్ మురగ్, మటన్ కోఫ్తా, మొగలాయి మటన్, మొగలాయి చికెన్, ఖుర్బానీ కా మీఠా, డ్రై ఫ్రూట్స్ ఖీల్, నాన్ రోటి, రుమాలి రోటీ, పరాఠా, బగారా బైగన్, రైతాలతో పాటు మరిన్ని వెరైటీలు సిద్ధం కానున్నాయి.

హైదరాబాద్ వంటలతో పాటు అమెరికన్ రుచులనూ తయారు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలోని అతిపెద్ద డైనింగ్ టేబుల్ గా పేరు తెచ్చుకున్న ఫలక్ నుమా ప్యాలెస్ డైనింగ్ టేబుల్ పై ఈ వంటకాలను ఇవాంకాతో పాటు ముఖ్యమైన అతిథులు కొందరికి వడ్డించనున్నారు. ఆమె రుచి చూసే వంటకాలను ముందుగా అమెరికా నుంచి వచ్చిన షెఫ్ లు, ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తారు.

More Telugu News