bandla ganesh: 'టెంపర్' హక్కులను వంశీ మరొకరికి అమ్మేశాడు.. మనస్తాపానికి గురయ్యా.. న్యాయపోరాటం చేస్తా!: బండ్ల గణేష్

  • కోటి నాలుగు లక్షలకు 'టెంపర్' కథను కొన్నా
  • నాకు తెలియకుండానే హక్కులను మరొకరికి వంశీ అమ్మేశాడు
  • అందుకే చెక్ ఆపేశా

2015లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'టెంపర్' సినిమాను బండ్ల గణేష్ నిర్మించాడు. అయితే, ఆ సినిమా కథా రచయిత వక్కంతం వంశీకి చెల్లని చెక్కును ఇచ్చాడు. ఈ నేపథ్యంలో, బండ్ల గణేష్ పై వంశీ కేసు పెట్టాడు. కేసును విచారించిన ఎర్రమంజిల్ కోర్టు బండ్ల గణేష్ కు జైలు శిక్షను విధించింది, అయితే, వెంటనే ఆయన బెయిల్ పిటిషన్ వేసి, బెయిల్ పై వచ్చేశారు.

ఈ నేపథ్యంలో ఈ అంశంపై బండ్ల గణేష్ స్పందించాడు. వక్కంతం వంశీ నుంచి 'టెంపర్' కథ హక్కులను కోటి నాలుగు లక్షల రూపాయలకు కొన్నామని తెలిపాడు. సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత హిందీ రీమేక్ హక్కులను దర్శక నిర్మాత అయిన రోహిత్ శెట్టికి సంయుక్తంగా విక్రయించామని చెప్పాడు. అయితే, తనకు తెలియకుండానే 'టెంపర్' నవల హక్కులను వంశీ మరొకరికి అమ్మేశాడని... దీనివలన తాను తీవ్ర మనస్తాపానికి లోనయ్యానని... సినీ ఛాంబర్ దృష్టికి కూడా తీసుకెళ్లానని... ఈ నేపథ్యంలోనే, బ్యాలన్స్ డబ్బుల చెక్ ను నిలిపివేశానని తెలిపాడు.

ఈ వివాదం ఫిలిం ఛాంబర్ వద్ద ఉన్నప్పటికీ చెక్ ను పట్టుకుని వంశీ కోర్టుకు వెళ్లాడని... తాను కొంచెం ఉపేక్షించడం వల్ల కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందని బండ్ల గణేష్ చెప్పాడు. కోర్టు ద్వారా బెయిల్ పొందానని... ఈ విషయంపై ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ కు వెళతానని, వంశీపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపాడు. 'టెంపర్' సినిమాకు అద్భుతంగా మాటలు రాసి, కథను విస్తృత పరిచిన వ్యక్తి ఎవరో తనకు, తన యూనిట్ కు, సహాయ రచయితలకు తెలుసని చెప్పాడు. వంశీ మనస్సాక్షికి కూడా తెలుసని అన్నాడు. నటులకు, దర్శకులకు, టెక్నీషియన్స్ కు కోట్ల రూపాయలను చెల్లించిన తాను... 9 లక్షల రూపాయలను చెల్లించే స్థితిలో లేనా? అంటూ ప్రశ్నించాడు. తన అభిమానులు, ఆత్మీయులు ఈ విషయం అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు.

More Telugu News