UNO: దేశాలు దాటుతూ.. మధ్యధరా సముద్రంలో 33 వేల మంది జలసమాధి అయ్యారు: ఐక్యరాజ్యసమితి

  • ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సరిహద్దుల్లో మధ్యధరా సముద్రానిది అగ్రస్థానం
  • 2000 నుంచి 2016 వరకూ మధ్యధరా సముద్రం గుండా ప్రయాణిస్తూ 33,000 మంది జలసమాధి
  • శరణార్ధులను ఆదుకునే విషయంలో యూరోపియన్ యూనియన్, టర్కీతో ఒప్పందం

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సరిహద్దుల్లో మధ్యధరాసముద్రం అగ్రస్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. వివిధ దేశాల నుంచి అక్రమ మార్గంలో యూరోపియన్‌ యూనియన్‌ లోని వివిధ దేశాలను చేరుకునేందుకు మధ్యధరా సముద్రం మీదుగా వలసదారులు ప్రయాణిస్తున్నారని, ఇలా ప్రయాణిస్తూ ఈ సముద్రంలో 33,000 మంది జలసమాధి అయ్యారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. దీంతో మధ్యధరా సముద్రాన్ని అత్యంత ప్రాణాంతక సరిహద్దుగా గుర్తిస్తున్నట్టు తెలిపింది. 2000 నుంచి 2016 వరకూ మధ్యధరా సముద్రం మీదుగా ప్రయాణిస్తూ వీరంతా ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి ప్రకటనలో తెలిపింది.

 అయితే శరణార్ధులను ఆదుకునే విషయంలో యూరోపియన్ యూనియన్, టర్కీతో ఒప్పందం చేసుకోవడం వల్ల కొన్ని మరణాలను తగ్గించగలిగిందని ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ (ఐఓఎమ్‌) అభిప్రాయపడింది. ఈ ప్రకటనను యూరోపియన్‌ యూనివర్సిటీ అధ్యాపకుడు ఫిలిప్‌ తప్పుబట్టారు. వాస్తవానికి మధ్యధరా పొట్టనబెట్టుకున్న వారి సంఖ్య 33 వేలకు పైమాటేనని ఆయన అన్నారు. కేవలం 2017లోనే యూరోపియన్ యూనియన్ కు దాదాపు లక్షా 61 వేల మంది శరణార్థులు చేరుకున్నట్టు ఐవోఎం వెల్లడించిందని, ఈ క్రమంలో ఎంతో మంది నడిసంద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

More Telugu News