ivanka: ఇవాంకకు కనీవినీ ఎరుగని రీతిలో భద్రత ఏర్పాట్లు.. గోల్కొండ కోట విందుకు ఇవాంక హాజరు కావడం లేదట!

  • 6000 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు
  • శంషాబాద్, బేగంపేట్ ఎయిర్ పోర్ట్స్ నుంచి హెచ్ఐసీసీ క్యాంపస్ వరకు భారీ భద్రత
  • ఫలక్ నుమా ప్యాలెస్ విందుకు ఇవాంక హాజరు

గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ (జీఈఎస్) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంక ట్రంప్ హైదరాబాదు రానున్న నేపథ్యంలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. విమానాశ్రయంలో దిగిన దగ్గర్నుంచి తిరిగి విమానం ఎక్కేవరకు కట్టుదిట్టమైన భద్రత కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్, బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లకు వచ్చీపోయే మార్గాల్లో 24 గంటల పహారా ఏర్పాటు చేశారు. రెండు విమానాశ్రయాల్లోనూ రెండు వీఐపీ లాంజ్ లు రిజర్వు చేసిపెట్టారు.

వారు ప్రయాణించే మార్గాల్లోని రోడ్లపై బ్యానర్లు, ఆర్చ్ లు ఏర్పాటు చేయడాన్ని నిషేధించారు. 6000 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో పాలుపంచుకోనున్నారు. మెట్రో రైల్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో దిగి, అక్కడి నుంచి హెలికాప్టర్ లో మియాపూర్ వెళతారు. అక్కడి నుంచి కూకట్ పల్లి వరకు మెట్రో రైలులో ప్రయాణించి, తిరిగి అదే రైలులో మియాపూర్ చేరుకుంటారు.

అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హెచ్‌ఐసీసీలో జరిగే జీఈఎస్‌ కు హాజరుకానున్నారు. 28న మధ్యాహ్నం శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో ఇవాంక ట్రంప్ ల్యాండ్ అవుతారు. ఆమె వెంట 350 మంది రానున్నారు. వారి భద్రతా కార్యక్రమాలు అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ కమెండోలు, ఇవాంక వ్యక్తిగత భద్రత సిబ్బంది చూసుకుంటారు. సదస్సు జరిగే ప్రాంగణం చుట్టూ 4 కిలోమీటర్ల వరకు ఇతరులెవ్వరూ చొరబడకుండా మన పోలీసులు భద్రత కల్పిస్తారు.

ఫలక్‌ నుమా ప్యాలెస్, గోల్కొండ కోటల్లో జరిగే విందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ విందులో వివిధ రకాల వంటకాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఆ పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా ఆ మార్గాల్లో షాపుల యజమానుల సాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. హెచ్ఐసీసీ నుంచి 45 బస్సుల్లో నాలుగు దఫాలుగా ప్రతినిధులను ఫలక్‌ నుమా ప్యాలెస్ కు విందుకోసం చేరుస్తారు. ఇక 29న ఇవాంకా పర్యటనకు సంబంధించిన వివరాలేమీ తమవద్ద లేవని పోలీసు అధికారులు తెలిపారు.

ఆ రోజు అందిన సూచనల ప్రకారం భద్రత చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. 29న గోల్కొండ కోటలో జరిగే విందుకు ఆమె హాజరుకావడం లేదు. ఎయిర్ పోర్ట్ నుంచి సదస్సు ప్రాంగణానికి, ఫలక్ నుమా ప్యాలెస్ తదితర ప్రాంతాల్లో తిరిగేందుకు ఇవాంక కోసం మూడు వాహనాలను అమెరికా నుంచి అధికారులు తీసుకురాగా, రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు వాహనాలను సమకూర్చనుంది. సదస్సు అనంతరం ఆమె నేరుగా ఎయిర్ పోర్ట్ కు చేరుకోనుంది.

ఇవాంకను రిసీవ్‌ చేసుకునేందుకు హాజరయ్యే అధికారిక ప్రతినిధుల వివరాలు, సదస్సు కార్యక్రమాలు, ప్రొటోకాల్‌ వివరాల గురించి జిల్లా కలెక్టర్‌ ద్వారా అమెరికా సీక్రెట్ సర్వీసెస్ సిబ్బంది వివరాలు సేకరించారు. ఫలక్ నుమా ప్యాలెస్ లో ఇవాంకతో పాటు 101 డైనింగ్‌ టేబుల్‌ పై కూర్చునేవారి వివరాలు కూడా కూడా తెలుసుకున్నట్లు సమాచారం. లాడెన్‌ జాడ పసిగట్టేందుకు వాడిన బెల్జియం మాలినోస్‌ జాతి కుక్కలను, ల్యాబ్రడార్‌, జర్మన్‌ షెఫర్డ్‌ కుక్కలను సదస్సు ప్రాంగణంలో రక్షణ కోసం వాడనున్నారు. ఈ కుక్కలు మందుపాతరలను కూడా గుర్తించగలిగే సామర్థ్యం కలిగి ఉండడం విశేషం.

More Telugu News