telangana: బీచ్ లో నిర్వహించాల్సిన వేడుక హైదరాబాదులో నిర్వహించడం ఏంటి?: 'సన్ బర్న్ ఈవెంట్'పై వీహెచ్

  • నేటి సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో సన్ బర్న్ ఈవెంట్
  • ప్రవేశ రుసుము 3,000 రూపాయల నుంచి 3,00,000 రూపాయలా?
  • మద్యం ఏరులై పారుతుంది

హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో నేటి సాయంత్రం సన్ బర్న్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతూ, బీచ్ లో నిర్వహించాల్సిన ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించడమేంటంటూ ప్రశ్నించారు. గోవా వంటి రాష్ట్రాలే ఈ ఈవెంట్ కు అనుమతి ఇవ్వడం లేదని, అలాంటప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అనుమతివ్వాల్సి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజలకు ఏం ప్రయోజనమని అన్నారు. 'ఈ ఈవెంట్ లో 15 ఏళ్ల పిల్లలకు కూడా అనుమతి ఉందంటున్నారు.. అక్కడ వాళ్లేం నేర్చుకుంటారు' అని అడిగారు. ఈ ఈవెంట్ లో పాల్గొనాలంటే భారీ మొత్తం ప్రవేశరుసుం చెల్లించాల్సి ఉందని తెలుస్తోందని, అంత ఘనత ఆ ఈవెంట్ లో ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. మద్యం ఏరులైపారుతుందని సమాచారం ఉందని ఆయన అన్నారు. ఇలాంటి ఈవెంట్ నిర్వహణ వల్ల తెలంగాణకు మంచి పేరు వస్తుందా? అని ఆయన అడిగారు. కాగా, ఈ ఈవెంట్ లో పాల్గొనాలంటే 3,000 రూపాయల నుంచి 3,00,000 రూపాయల వరకు ప్రవేశరుసుం చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. 

More Telugu News