rajasingh: అప్పట్లో క‌ర్ణిసేన మాట్లాడడానికి వెళితే 'ప‌ద్మావ‌తి' ద‌ర్శ‌కుడు గాల్లోకి కాల్పులు జ‌రిపాడు!: ఎమ్మెల్యే రాజాసింగ్

  • భ‌న్సాలీ కాల్పులు జ‌రిపాకే క‌ర్ణిసేన ఆయ‌న‌పై దాడి చేసింది
  • ప‌ద్మావ‌తిపై సినిమా తీయ‌డం లేద‌ని భ‌న్సాలీ అప్ప‌ట్లో అన్నాడు
  • వేరే క‌థ‌తో సినిమా తీస్తున్నాన‌ని రాసిచ్చారు
  • ప‌ద్మావ‌తి అనేది క‌ల్పిత పాత్ర కాదు

రాజ్‌పుత్ 'రాణి పద్మిని' జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ప‌ద్మావ‌తి సినిమా షూటింగ్ మొద‌లు పెట్టింది మొద‌లు వివాదాలు వెంటాడుతూనే ఉన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను విడుద‌ల చేస్తే థియేట‌ర్ల‌ను త‌గుల‌బెడ‌తామ‌ని హెచ్చ‌రించిన హైద‌రాబాద్‌లోని గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ రోజు ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ప‌లు విష‌యాలు చెప్పారు. ప‌ద్మావ‌తి సినిమా షూటింగ్ జ‌రుగుతోన్న వేళ‌ భ‌న్సాలీతో మాట్లాడ‌డానికి క‌ర్ణిసేన‌ వెళ్లింద‌ని తెలిపారు. అయితే వారు అక్క‌డ‌కు రావ‌డంతో భ‌న్సాలీయే మొద‌ట గాల్లోకి కాల్పులు జ‌రిపాడ‌ని అన్నారు.

దీంతో క‌ర్ణిసేన ఆయ‌న‌పై దాడి చేసింద‌ని తెలిపారు. ఆ స‌మ‌యంలో పోలీసుల ముందు భ‌న్సాలీ ఓ విష‌యాన్ని తెలిపాడ‌ని, ప‌ద్మావ‌తిపై సినిమా తీయ‌డం లేద‌ని, తాను వేరే క‌థ‌తో తీస్తున్నాన‌ని రాసి ఇచ్చారని రాజాసింగ్ అన్నారు. అలా రాసి ఇచ్చిన భ‌న్సాలీ మ‌ళ్లీ పద్మావ‌తిపైనే సినిమా తీశారని అన్నారు. ఈ సినిమాలో చ‌రిత్ర‌ను మార్చాడని, మ‌సాలా కొట్టి చూపిస్తున్నాడని మండిప‌డ్డారు.

డ‌బ్బుల కోసం ఇటువంటివి చేస్తున్నాడ‌ని రాజా సింగ్ ఆరోపించారు. ప‌ద్మావ‌తి అనేది క‌ల్పిత పాత్ర కాదని, రాణి ప‌ద్మావ‌తిపై చాలా పుస్త‌కాలు ఉన్నాయని అన్నారు. రాజ‌స్థాన్‌లో ఏడ‌వ త‌ర‌గ‌తిలో కూడా ప‌ద్మావ‌తి హిస్ట‌రీ ఉందని తెలిపారు. చ‌రిత్ర‌లో ప‌ద్మావ‌తి లేద‌ని, ఆమె చ‌రిత్ర‌ లేద‌ని కొంద‌రు అంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

More Telugu News