డొనాల్డ్ ట్రంప్‌ను గ‌ద్దె దింపాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న డెమోక్రాట్‌!

23-11-2017 Thu 16:14
  • న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో బిల్‌బోర్డులు
  • పిటిష‌న్‌లో సంత‌కం చేయాలంటూ ప్ర‌చారం
  • ప్ర‌చారం కోసం 20 మిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు చేస్తున్న టామ్ స్టీయ‌ర్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గ‌ద్దె దింపాల‌ని డెమోక్రటిక్ పార్టీ మ‌ద్ద‌తుదారుడు టామ్ స్టీయ‌ర్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకోసం దాదాపు 20 మిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు చేయ‌డానికి కూడా వెన‌కాడ‌టం లేదు ఈ బిలియ‌నీర్‌. ఇటీవ‌ల ప్ర‌పంచంలో అత్యంత ర‌ద్దీగా ఉండే ప్ర‌దేశాల్లో ఒక‌టైన న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వ‌ద్ద బిల్‌బోర్డ్ ప్ర‌క‌ట‌న ఏర్పాటు చేశారు.

న్యూ ఇయ‌ర్ వ‌ర‌కు గంట‌కు ఆరుసార్లు ఈ ప్ర‌క‌ట‌న‌లు ప్ర‌సారం అయ్యేలా స్టీయ‌ర్ ఏర్పాటు చేశారు. ట్రంప్‌ను అభిశంస‌న తీర్మానం ద్వారా గ‌ద్దె దింపేందుకు వేసిన పిటిష‌న్ మీద సంత‌కం చేయాల‌నేది ఈ ప్ర‌క‌ట‌న‌ల సారాంశం. ప్ర‌తిరోజు ఈ ప్రాంతం గుండా దాదాపు 3,50,000ల మంది వెళ్తుంటారు. ఇక న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఇక్క‌డ జ‌రిగే కౌంట్‌డౌన్‌లో పాల్గొన‌డానికి ల‌క్ష‌ల మంది హాజ‌ర‌వుతారు. ఇప్ప‌టి వ‌ర‌కు పేప‌ర్లో ప్ర‌క‌ట‌న‌, టీవీ కార్య‌క్ర‌మాల ద్వారా స్టీవ్ ప్ర‌చారం చేయ‌డం వ‌ల్ల 26,50,000ల మందికి పైగా ఈ పిటిష‌న్ మీద సంత‌కం చేసిన‌ట్లు తెలుస్తోంది.