Gujarath: ఫూల్స్ ఇచ్చే హామీలను ఫూల్స్ మాత్రమే అంగీకరిస్తారు.. హార్దిక్ పటేల్‌పై నాన్‌స్టాప్‌గా విరుచుకుపడిన గుజరాత్ ఉప ముఖ్యమంత్రి

  • పది నిమిషాలపాటు హార్ధిక్‌ను ఏకిపారేసిన డిప్యూటీ సీఎం
  • తన 60 ఏళ్ల రాజకీయ జీవితంలో హార్దిక్ లాంటి వాళ్లను బోల్డంత మందిని చూశానని వ్యాఖ్య
  • ఇలా ఎగిరిపడిన నేతలు అడ్రస్ లేకుండా పోతారని తీవ్ర వ్యాఖ్యలు

త్వరలో జరగనున్న గుజరాత్ ఎన్నికల్లో గెలిస్తే పటీదార్ రిజర్వేషన్ పార్ములాను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ ప్రకటించారు. కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో గుజరాత్ ఎన్నికల్లో పటీదార్లంతా కాంగ్రెస్ వెనకే ఉంటారని బుధవారం తేల్చి చెప్పారు.

హార్ధిక్ వ్యాఖ్యలపై గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ తీవ్రంగా స్పందించారు. ఫూల్స్ ఇచ్చిన ఫార్ములా హామీని ఫూల్స్ అంగీకరించారని వ్యాఖ్యానించారు. హార్దిక్ లాంటి ఎందరో నేతలు ఇలా ఎగిరి అలా కిందపడ్డారని అన్నారు. హార్దిక్ తన చుట్టూ ఉన్న ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

దాదాపు పది నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడిన నితిన్ పటేల్ హార్దిక్‌పై విరుచుకుపడ్డారు. ‘‘నీలాంటి నేతలను ఎంతమందిని చూడలేదు. ఇలాంటి బ్లాక్ స్టార్స్ ఇలా వెలిగి అలా ఆరిపోతాయి. గతంలో నవ్ నిర్మాణ్ ఆందోళనతో వెలుగులోకి వచ్చినవారు ఇప్పుడు వారెవరో పక్కింటి వారికి కూడా తెలియదు. నువ్వు కూడా తుడిచిపెట్టుకుపోతావ్. పటీదార్ కమ్యూనిటీ నీపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుంది. నీ పేరు చరిత్రలో నల్ల అక్షరాలతో లిఖించబడుతుంది. తలెత్తుకోవడానికే సిగ్గుపడతావ్’’ అని ఉప ముఖ్యమంత్రి నాన్‌స్టాప్‌గా దుమ్మెత్తి పోశారు.

‘‘నువ్వు రాహుల్ గాంధీకి భజన చేయాలనుకుంటే చెయ్యి.. అంతేకానీ సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ పేర్లను మాత్రం ఉపయోగించకు. నీకా అర్హత లేదు. నీ చుట్టూ ఉన్న వారిని నువ్వు మోసం చేస్తున్నావ్’’ అన్నారు. ‘‘మేం అధికారంలో ఉన్నామని ఏమీ చేయలేమని అనుకుంటున్నావేమో! మేం చాలా గౌరవంగా ప్రవర్తిస్తాం. నా 55-60 ఏళ్ల రాజకీయ జీవితలో నీలాంటి వాళ్లను బోల్డంతమందిని చూశాను’’ అని నితిన్ పటేల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

More Telugu News