YSRCP: నారా లోకేష్ పై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తాం: వైసీపీ

  • చట్ట సభలను లోకేష్ పక్కదోవ పట్టిస్తున్నారు
  • పాదయాత్రకు వస్తున్న ఆదరణను చంద్రబాబు ఓర్వలేక పోతున్నారు
  • ప్రత్యేక హోదా కోసం ప్రైవేట్ బిల్లు పెట్టాం

ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, దీనిపై విచారణ జరపాలని మాత్రమే తాము కేంద్రానికి లేఖలు రాశామని... నిధులు ఆపాలని కాదని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ విషయంపై వాస్తవాలను వక్రీకరిస్తూ, చట్ట సభలను ఏపీ మంత్రి లోకేష్ పక్కదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పదిసార్లు అబద్దాలు చెప్పినంత మాత్రాన... అవన్నీ నిజాలు కాబోవని అన్నారు. వారి నాన్న చంద్రబాబు మాదిరిగానే ఒక అబద్దాన్ని పదిసార్లు చెప్పి నిజం చేయాలనే సంస్కృతిని లోకేష్ అనుసరిస్తున్నారని అన్నారు.

పేదలకు తిండి పెట్టే కార్యక్రమం నీరుగారిపోతోందని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, యంత్రాలతో పని చేయిస్తున్నారని మాత్రమే తాము లేఖలో పేర్కొన్నామని చెప్పారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న లోకేష్ పై లోక్ సభ స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న ఆదరణను చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారని సుబ్బారెడ్డి అన్నారు. అందుకు జగన్ పై కుట్రలకు పాల్పడుతున్నారని... ప్రతిపక్ష నేత వద్దకు సమస్యలను చెప్పుకోవడానికి వస్తున్నవారిని కూడా అడ్డుకుంటారా? అంటూ మండిపడ్డారు. జగన్ ను ప్రజల నుంచి దూరం చేయాలని కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు.

ప్రత్యేక హోదాపై పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు పెట్టామని... వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇది చర్చకు వచ్చే అవకాశం ఉందని సుబ్బారెడ్డి తెలిపారు. హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశామని... అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు సాగుతామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. 

More Telugu News