mugabe: జింబాబ్వేలో సైనిక తిరుగుబాటు వెనుక డ్రాగన్ హస్తం?.. నానాటికీ బలపడుతున్న అనుమానాలు!

  • జింబాబ్వే ఆర్మీ చీఫ్ ను పిలిపించుకున్న చైనా
  • ఆయన తిరిగిరాగానే సైనిక తిరుగుబాటు
  • ముగాబే దిగిపోవాలని కొన్నేళ్లుగా కోరుకుంటున్న చైనా

జింబాబ్వేలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగింపు దశకు చేరుకుంది. రాబర్ట్ ముగాబే స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక దాదాపు ఖరారయింది. అయితే, హఠాత్తుగా జరిగిన సైనిక తిరుగుబాటు వెనుక చైనా హస్తం ఉందనే వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వాస్తవానికి 1970 నుంచి జింబాబ్వేతో చైనా స్నేహ సంబంధాలు బలంగానే ఉన్నాయి. ముగాబేతో సన్నిహితంగా మెలిగిన చైనా... అక్కడి వ్యవసాయరంగం, షిప్పింగ్ ఇలా దాదాపు అన్ని రంగాల్లో పెట్టుబడులు పెడుతూ వచ్చింది. జింబాబ్వేకు అప్పటి సోవియట్ రష్యా ఆయుధాలను సరఫరా చేయడానికి విముఖత చూపడంతో... చైనా ముందుకు వచ్చింది. జింబాబ్వే కొత్త పార్లమెంటు నిర్మాణానికి ఆసక్తి చూపింది.

అలాంటి చైనాకు, జింబాబ్వేకు మధ్య గత కొన్నేళ్లుగా కొన్ని విభేదాలు తలెత్తాయి. చైనాతో ఆయుధాల ఒప్పందాన్ని 2008లో జింబాబ్వే రద్దు చేసుకుంది. ఆయుధాలను తిప్పి పంపించింది. ఇది చైనాకు ఆగ్రహాన్ని తెప్పించింది. అయితే, అప్పటికే బిలియన్ డాలర్ల పెట్టుబడులను జింబాబ్వే పెట్టి ఉండటంతో... చైనా సైలెంట్ అయిపోయింది. అయితే, రక్షణ సాయాన్ని కూడా క్రమంగా తగ్గిస్తూనే వచ్చింది. మరోవైపు, సందు దొరికినప్పుడల్లా ముగాబే పాలనపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చింది. ముగాబే గద్దె దిగిపోవాలంటూ పలుమార్లు పరోక్షంగా హెచ్చరించింది.

మరోవైపు, వయసు మీద పడటంతో, తన భార్య గ్రేస్ ను అధ్యక్షురాలిగా చేయాలని ముగాబే భావించారు. ఈ నిర్ణయం సొంత పార్టీలోనే చిచ్చు రాజేసింది. ఈ పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా మలుచుకుంది. జింబాబ్వే ఆర్మీ చీఫ్ కాన్ స్టాంటినో చివెంగాను చైనాకు ఉన్నపళంగా పిలుపించుకుంది. ఈ నెల మొదట్లో చైనా పర్యటన నుంచి చివెంగా తిరిగి వచ్చిన వెంటనే.... సైనిక తిరుగుబాటు జరిగింది. దీంతో, ఈ మొత్తం వ్యవహారం వెనుక చైనా హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే, జింబాబ్వేలో ఇంత జరుగుతున్నా చైనా మాత్రం కిక్కురుమనకుండా ఉంది. 

More Telugu News