sangita: ఎమ్మెల్యే హోదాలో ఉండి ఒక ఆడ‌పిల్ల‌తో ఇలాగేనా మాట్లాడేది?: టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి భార్య స‌ంగీత

  • ఎమ్మెల్యే వ‌చ్చారు.. వెళ్లిపోయారు
  • ఇంటి తాళాలు ప‌గుల‌కొట్టిస్తామ‌ని, ఇంట్లోకి వెళ్ల‌మ‌ని చెప్పారు
  • నా అత్తామామ‌ల‌ను అరెస్టు చేయాలి
  • నాకు ఎలాంటి న్యాయం చేస్తారో చెప్పాలి

ఆడ‌పిల్ల పుట్టినందుకు త‌న భార్య సంగీత‌ను చావ‌బాది, ఇంటి నుంచి గెంటేసిన బోడుప్ప‌ల్ వాసి, టీఆర్ఎస్ నేత‌ శ్రీనివాస్ రెడ్డిపై మ‌హిళా సంఘాలు పోరాడుతున్నాయి. త‌న భ‌ర్త మ‌రో పెళ్లి చేసుకున్నాడ‌ని తెలుసుకున్న హైద‌రాబాద్ చందాన‌గ‌ర్‌కు చెందిన‌ సంగీత త‌న భర్త ఇంటికి వచ్చి అతడిని నిలదీయగా, ఆమెను తీవ్రంగా కొట్టి ఇంటి నుంచి గెంటేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం సంగీత భ‌ర్త ఇంటి ముందే కూర్చుని పోరాడుతోంది. ఈ నేప‌థ్యంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్క‌డకు వ‌చ్చి వెళ్లారు. అయితే, ఆయ‌న‌తో మ‌హిళా సంఘాలు గొడ‌వ‌కు దిగాయి. ఆయ‌న మాట తీరు బాగోలేద‌ని చెప్పాయి.

ఏ న్యాయం కావాలి నీకు? అంటూ త‌న‌తో స‌ద‌రు ఎమ్మెల్యే మాట్లాడా‌డ‌ని సంగీత మీడియాతో చెప్పింది. శ్రీనివాస్ రెడ్డికి మ‌ద్దతుగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతున్నట్లు అనిపించింద‌ని తెలిపింది. ఇంటి తాళాలు ప‌గుల‌కొడ‌తామ‌ని, ఇంట్లోకి వెళ్లి ఉండ‌మ‌ని అన్నార‌ని చెప్పారు. 'శ‌్రీనివాస్ రెడ్డిని ఇంట్లోకి రానివ్వ‌కుండా చేస్తా' అంటూ ఏవేవో మాట్లాడార‌ని, త‌న‌కు న్యాయం చేసే ప‌ద్ధ‌తి ఇదేనా? అని ఆమె ప్ర‌శ్నించింది.

ఎమ్మెల్యే హోదాలో ఉండి సుధీర్ రెడ్డి ఒక ఆడ‌పిల్ల‌తో ఇలాగేనా మాట్లాడేది? అని స‌ంగీత ప్ర‌శ్నించింది. మొద‌ట త‌న అత్తామామ‌ల‌ను అరెస్టు చేయాలని, త‌న‌కు ఎలాంటి న్యాయం చేస్తారో చెప్పాలని ఆమె డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే వ‌చ్చి, ఏదో మాట్లాడి వెళ్లిపోయార‌ని, త‌న‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు త‌న భ‌ర్త ఇంటి ముందు నుంచి క‌ద‌ల‌బోన‌ని చెప్పింది.   

More Telugu News