Astronomy: 2018లో భూకంపాలే భూకంపాలు: శాస్త్రవేత్తలు

  • భూకంపాలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు 
  • భూభ్రమణ వేగం పెరిగినా, తగ్గినా భూకంపాలు వస్తాయని నిర్ధారణ
  • ఐదేళ్లకోసారి భూభ్రమణ వేగంలో మార్పులు..32 ఏళ్లకోసారి తీవ్రమైన భూకంపాలు

వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు పట్టికుదిపేసే అవకాశం ఉందని భౌగోళిక శాస్త్రవేత్తలు తెలిపారు. యూనివర్శిటీ ఆఫ్‌ కొలరాడో, యూనివర్శిటీ ఆఫ్‌ మోంటానాకి చెందిన శాస్త్రవేత్తలు రాబర్ట్‌ బిల్హామ్‌, రెబెక్కాలు 1900 కాలం నుంచి ఇప్పటివరకు రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో సంభవించిన భూకంపాలపై అధ్యయనం చేశారు. భూభ్రమణ వేగం ఎక్కువ, తక్కువగా ఉన్నప్పుడే తీవ్రమైన భూకంపాలు సంభవిస్తున్నాయని వారు వెల్లడించారు. అది కూడా జనాభా అధికంగా గల ప్రాంతాల్లోనే ఈ భూకంపాలు సంభవిస్తున్నాయని వారు వెల్లడించారు.

 2017లో 15 నుంచి 20 తీవ్రమైన భూకంపాలు సంభవించగా, 2018లో 25 నుంచి 30 వరకు తీవ్రమైన భూకంపాలు వచ్చే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. రోజూ ప్రతి అరక్షణానికి భూభ్రమణ వేగం మారుతుంటుందని వారు వెల్లడించారు. ఈ వేగం ఎక్కువైనా, తక్కువైనా భూకంపాలు తప్పవని వారు స్పష్టం చేశారు.

ప్రతి ఐదేళ్లకోసారి భూభ్రమణ వేగం మారుతుంటుందని తెలిపిన శాస్త్రవేత్తలు, 32 ఏళ్లకోసారి తీవ్రమైన భూకంపాలు సంభవిస్తాయని వెల్లడించారు. సాధారణంగా భూభ్రమణ వేగంలో ప్రతి ఐదేళ్లకు ఓసారి మార్పు వస్తుంటుంది. గత నాలుగేళ్లుగా భూభ్రమణ వేగం తక్కువగానే ఉంది కనుక, గడచిన నాలుగేళ్ల కాలంలో ఏటా సగటున 15 పెద్ద భూకంపాలు వచ్చాయని వారు తెలిపారు. 2018కి ఐదో సంవత్సరం అవుతుంది కాబట్టి, భూభ్రమణ వేగం పెరిగి 20 నుంచి 30 వరకు భారీ భూకంపాలు ఏర్పడే ప్రమాదముందని వారు హెచ్చరించారు. 

More Telugu News