Delhi: డెంగీతో ఢిల్లీ ఆసుపత్రిలో చేరిన చిన్నారి మృతి.. రూ.16 లక్షల బిల్లు చేతిలో పెట్టిన వైద్యులు!

  • రెండు వారాల చికిత్సకు రూ.16 లక్షల బిల్లు
  • విస్తుపోయిన తల్లిదండ్రులు.. సర్వత్ర విమర్శలు
  • రంగంలోకి దిగిన కేంద్ర మంత్రి నడ్డా.. సాయం అందిస్తామని హామీ

ఢిల్లీలోని ఓ ఆసుపత్రి చేసిన నిర్వాకం గురించి తెలిస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. డెంగీతో ఆసుపత్రిలో చేరిన బాలిక మరణిస్తే రెండు వారాల చికిత్సకు గాను ఏకంగా రూ.16 లక్షల బిల్లు చేతిలో పెట్టడం సంచలనం సృష్టిస్తోంది.

ద్వారకకు చెందిన ఐటీ ఉద్యోగి జయంత్  సింగ్ డెంగీతో బాధపడుతున్న తన ఏడేళ్ల కుమార్తె ఆద్యా సింగ్‌ను గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చేర్చారు. రెండు వారాల చికిత్స తర్వాత పరిస్థితి విషమించడంతో ఆద్య కన్నుమూసింది. అయితే 15 రోజులపాటు ఆమెకు అందించిన వైద్య సేవలకు గాను ఆసుపత్రి యాజమాన్యం ఏకంగా రూ. 15.79 లక్షల బిల్లు చేతికిచ్చింది.  దీంతో విస్తుపోవడం తల్లిదండ్రుల వంతు అయింది.

ఆసుపత్రి బిల్లు చెల్లించేందుకు జయంత్ రూ. 5 లక్షల పర్సనల్ లోన్ తీసుకున్నారు. కుటుంబ సభ్యులు, తెలిసినవారు, ఇతరుల నుంచి మరికొంత తీసుకున్నారు. ఆసుపత్రి బిల్లు చూసి నిశ్చేష్టుడైన బాలిక తండ్రి దానిని ట్విట్టర్‌లో పెట్టడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ట్వీట్ 9 వేల సార్లు రీ ట్వీట్ అయింది. ఆసుపత్రి ఇచ్చిన బిల్లులో నర్సులు ఉపయోగించిన 2700 గ్లోవ్స్‌కు బిల్లు వేయడం గమనార్హం.

ఆసుపత్రి తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రమంత్రి నడ్డా రంగంలోకి దిగారు. ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని, అందుకు సంబంధించిన వివరాలు పంపాలని ట్వీట్ చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా, తమపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను ఫోర్టిస్ ఆసుపత్రి యాజమాన్యం ఖండించింది. తామేమీ తప్పుచేయలేదని తేల్చి చెప్పింది.

More Telugu News