Donald Trump: ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. ఉగ్రవాదులను పోషిస్తున్న దేశంగా ప్రకటన!

  • ఆ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందన్న ట్రంప్
  • ఇప్పటికైనా అణ్వస్త్ర పరీక్షలకు స్వస్తి చెప్పాలని సూచన
  • మరిన్ని ఆంక్షల అమలుకు మార్గం సుగమం

ఉత్తర కొరియాకు అమెరికా మరోమారు షాకిచ్చింది. ఉగ్రవాదులను పోషిస్తున్న దేశంగా నార్త్ కొరియాను ప్రకటించింది. ఇప్పటికే ఆ దేశంపై ఆంక్షలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయంతో మరోమారు అగ్గి రాజేశారు. ప్రపంచం మొత్తుకుంటున్నా, ఐక్యరాజ్య సమితి చెబుతున్నా వినకుండా నార్త్ కొరియా వారానికో క్షిపణి పరీక్ష నిర్వహిస్తూ ఉద్రిక్తతలు పెంచుతోంది. ఇప్పటికే పలు అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణులను పరీక్షించిన నార్త్ కొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్ మరిన్ని పరీక్షలకు  సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

కాగా, ఉత్తర కొరియాను ఉగ్రవాద పోషక దేశంగా ప్రకటించిన అమెరికా మరిన్ని ఆంక్షలు అమలు చేసేందుకు సిద్ధమైంది. ‘‘నార్త్ కొరియాను నేడు ఉగ్రవాద పోషక దేశంగా ప్రకటిస్తున్నాం. చాలా ఏళ్ల క్రితమే ఈ పని చేయాల్సింది’’ అని శ్వేతసౌధంలో సోమవారం ట్రంప్ ప్రకటించారు. అణ్వస్త్ర పరీక్షలతో ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్న నార్త్ కొరియా ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతోందని, విదేశాలను నాశనం చేయాలని చూస్తోందని ట్రంప్ ఆరోపించారు.

ఈ ఏడాది మలేషియా విమానాశ్రయంలో కిమ్ జోంగ్ సోదరుడు హత్యకు గురయ్యారు. ఈ ఘటన వెనక కిమ్ హస్తం ఉన్నట్టు అమెరికా ఆరోపించింది. నార్త్ కొరియా చట్టబద్ధంగా నడుచుకోవాలని, అణ్వస్త్ర పరీక్షలకు స్వస్తి చెప్పాలని, అంతర్జాతీయంగా ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే చర్యలను మానుకోవాలని ట్రంప్ హెచ్చరించినట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ పేర్కొన్నారు.

More Telugu News