Rahul Gandhi: డిసెంబరు 8న రాహుల్ పట్టాభిషేకం.. వడివడిగా ఏర్పాట్లు!

  • గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఫలితాల విడుదలకు ముందే పగ్గాలు
  • ముహూర్తం ఖారారు చేసిన అధిష్ఠానం
  • నేడు పార్టీ అంతర్గత ఎన్నికల షెడ్యూలు ఖరారు

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి ముహూర్తం సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్టు  జరిగితే వచ్చే నెల 8న రాహుల్ అధ్యక్ష పగ్గాలను స్వీకరిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాల కంటే ముందుగానే ఆయన పట్టాభిషేకం కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సీడీబ్ల్యూసీ భావిస్తోంది. నేడు జరగనున్న సమావేశంలో ఇందుకు సంబంధించిన పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, పరిశీలన, ఓటింగ్ తదితర ప్రక్రియల తేదీలను నిర్ణయించనున్నారు. రాహుల్‌కు పోటీగా ఎవరైనా బరిలోకి దిగితే ఈ మొత్తం ప్రక్రియకు 14 రోజులు పడుతుంది. ఏకగ్రీవమైతే ఏ సమస్యా లేదు.

గుజరాత్ ఎన్నికల తొలి విడత పోలింగ్ డిసెంబరు 9న, రెండో విడత 14న జరగనుండగా 18న తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. కాబట్టి ఈలోపే రాహుల్‌కు పగ్గాలు అప్పగించాలని అధిష్ఠానం భావిస్తోంది. ప్రస్తుతం రాహుల్ క్రేజ్ పీక్ స్టేజిలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడే పని కానిచ్చేస్తే పోతుందని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, రాహుల్ కనుక పార్టీ పగ్గాలు స్వీకరిస్తే నెహ్రూ కుటుంబం నుంచి ఈ పదవి చేపట్టిన ఐదో వ్యక్తి అవుతారు.

More Telugu News