director bobby: "చిన్నప్పుడు నీకన్ని చిరంజీవి సినిమాలు చూపించా... నాకు ఆయన్ని చూపించవా?"... అని నాన్న అడిగితే బాధేసిందన్న దర్శకుడు బాబీ!

  • చిరంజీవి సినిమా వస్తే చెక్కేసేవాళ్లం
  • ఆయన్ని చూపించాలని కోరారు
  • విషయం చిరంజీవికి తెలిసి స్వయంగా మా ఇంటికే వచ్చారు
  • తన తండ్రికిచ్చిన అతిపెద్ద బహుమతి ఇదేనన్న బాబీ

చిరంజీవి సినిమాలతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని దర్శకుడు బాబీ గుర్తుచేసుకున్నాడు. "ఆయన సినిమా విడుదలైతే అందరికంటే ముందు మా నాన్న రెడీ అయిపోయేవారు. ఆయన సందు చివరన నిలబడి ఉంటే, నేను స్కూలుకెళుతున్నానని చెప్పి, యూనిఫామ్ వేసుకుని, చేత్తో క్యారేజీ పట్టుకుని వెళ్లేవాడిని. వీధి చివరన ఉన్న నాన్నతో కలసి చక్కగా సినిమాకు చెక్కేసేవాళ్లం" అని తన చిన్నప్పటి విషయాలు చెబుతూ, ఇటీవల జరిగిన ఓ ఆసక్తికర ఘటనను పంచుకున్నాడు.

కొద్ది రోజుల క్రితం నాన్న ఆరోగ్యం పాడైంది. ఆ సమయంలో నన్ను పిలిపించి, "ఏరా, చిన్నప్పుడు నీకన్ని చిరంజీవి సినిమాలు చూపించా. నాకు ఆయన్ని చూపించవా?" అని అడిగారు. ఆ సమయంలో నాకు చాలా బాధేసింది. వెంటనే దర్శకుడు వినాయక్ కు ఫోన్ చేసి విషయం చెబితే, అరగంటలో చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి, తానే మా ఇంటికి వస్తానని చెప్పారని అన్నాడు. ఆయన వస్తే, ఆ సంతోషంలో నాన్నకేమైనా అవుతుందని భయపడి, తామే వస్తామని చెప్పినా చిరంజీవి వినలేదని, 'జై లవకుశ' విడుదల రోజు ఆయన తన ఇంటికి వచ్చి రెండు గంటలు గడిపారని బాబీ వెల్లడించాడు. తన తండ్రికి తానిచ్చిన అతిపెద్ద బహుమతి ఇదేనని అన్నాడు.

More Telugu News