bbc: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను స్మగ్లింగ్ చేస్తున్న యూఎస్, యూకే... 'రఖాస్ డర్టీ సీక్రెట్' పేరిట బీబీసీ సంచలన కథనం

  • ఉగ్రవాదులను క్షేమంగా తరలించిన సైన్యాలు
  • సిరియా అంతటా వ్యాపిస్తున్న ఉగ్రవాదులు
  • వారికి తోడవుతున్న విదేశీ ఫైటర్లు
  • ప్రపంచానికి తెలియకుండా దాచారన్న బీబీసీ

అమెరికా, యూకే సాయుధ దళాలు, కుర్దిష్ సైన్యాలు సంయుక్తంగా ఓ డీల్ ను కుదుర్చుకుని వందలాది మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను సిరియాలోని రఖా పట్టణం నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారని 'రఖాస్ డర్టీ సీక్రెట్' పేరిట బీబీసీ సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. ఐఎస్ఐఎస్ ఫైటర్లు, వారి కుటుంబాలను మోసపూరితంగా ఖాళీ చేయిస్తున్నారని, రఖా పట్టణం దాటిన తరువాత వారు ఎక్కడికి వెళుతున్నారన్న విషయాన్ని సైన్యాలు పట్టించుకోవడం లేదని ఆరోపించింది.

రఖా నుంచి స్మగుల్ చేయబడిన ఉగ్రవాదులు సిరియా అంతటా వ్యాపిస్తున్నారని పేర్కొంది. ఇక సిరియా, ఇరాక్ దేశాల పౌరులు కాకుండా, విదేశాల నుంచి వచ్చి ఐఎస్ఐఎస్ తరఫున ఫారిన్ ఫైటర్స్ గా కొనసాగిన ఉగ్రవాదులు సైతం తప్పించుకుని రఖా దాటి బయటకు వచ్చి, తిరిగి ఉగ్రవాదులతో కలుస్తున్నారని పేర్కొంది.

ఫ్రాన్స్, టర్కీ, అజర్ బైజాన్, పాకిస్థాన్, యమన్, సౌదీ, చైనా, ట్యునీషియా, ఈజిప్ట్ వంటి దేశాల నుంచి వచ్చిన వందలాది మంది ఉగ్రవాదుల్లో ఉన్నారని ఓ స్థానిక డ్రైవర్ చెప్పిన మాటలను బీబీసీ ఉటంకించింది. దాదాపు 250 మంది ఫైటర్లు, 3,500 మందికి పైగా వారి కుటుంబాలు, భారీ ఎత్తున ఆయుధాలతో అక్టోబర్ 12న పలు ట్రక్కుల్లో అక్టోబర్ 12న వీరు రక్కా దాటారని, అందుకు సైన్యం పూర్తిగా సహకరించిందని బీబీసీ తెలిపింది.

"ఓ భయంకర నిజాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచిపెడుతున్నారు" అని వ్యాఖ్యానించింది. ఈ ఘటన జరగడానికి ముందు సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (ఎస్డీఎఫ్) దళాలు, రఖా నుంచి మీడియా మొత్తాన్నీ బయటకు పంపించి వేశాయని, అందువల్లే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల స్మగ్లింగ్ ఏ మీడియాకూ దొరకలేదని తెలిపింది. కాగా, ఈ వార్తలపై ఎస్డీఎఫ్ స్పందిస్తూ, కేవలం డజన్ల సంఖ్యలో ఫైటర్లు నగరాన్ని దాటారని, వారంతా స్థానికులేనని వివరణ ఇచ్చింది. కానీ, ఈ కాన్వాయ్ ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల పొడవుందని వందలాది వాహనాలు బారులు తీరాయని బీబీసీ ప్రకటించడం గమనార్హం.

"ఈ మొత్తం ఉదంతాన్ని రహస్యంగా వీడియో తీశారు. సాయుధులైన ఫైటర్లతో కూడిన వాహనాలు బారులు తీరాయి. కేవలం వ్యక్తిగత ఆయుధాలను మాత్రమే తీసుకుని బయటకు వెళ్లేందుకు ఉగ్రవాదులను అనుమతించగా, వారు తమకు సాధ్యమైనన్ని ఆయుధాలను తీసుకెళ్లారు. పది ట్రక్కుల ఆయుధాలు, మందుగుండుతోనే నిండి ఉన్నాయి" అని బీబీసీ రిపోర్టు పేర్కొంది.

More Telugu News