KTR: ప్రాజెక్టులు క‌డ‌దామంటే.. ఉద్యోగాలు ఇద్దామంటే.. కాంగ్రెసే అడ్డుప‌డుతోంది: మ‌ంత్రి కేటీఆర్‌ ఫైర్

  • తెలంగాణ వ‌స్తే విద్యుత్ ఉండ‌ద‌ని ఎద్దేవా చేశారు
  • కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తొక్కితేనే బంగారు తెలంగాణ సాధ్యం
  • తెలంగాణ అభివృద్ధికి ఇప్ప‌టికీ అడ్డుప‌డుతున్నారు

కాంగ్రెస్ పార్టీ తాము చేయాల‌నుకుంటోన్న అభివృద్ధి ప‌నుల‌న్నింటికీ అడ్డుప‌డుతోంద‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ రోజు హ‌న్మ‌కొండ‌లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలకు శంకుస్థాప‌న చేసిన అనంత‌రం బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాము విద్యుత్తు ఇచ్చే ప్ర‌యత్నం చేద్దామ‌న్నా, ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇద్దామన్నా, ప్రాజెక్టులు క‌డదామ‌న్నా కాంగ్రెస్ నేత‌లు అడ్డుప‌డుతున్నార‌ని అన్నారు. అన్ని అభివృద్ధి ప‌నుల‌కి కాంగ్రెస్ అడ్డుప‌డుతోంద‌ని మండిప‌డ్డారు.    

తెలంగాణకు ద‌రిద్రంలా ప‌ట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నేత‌లు, ఇప్ప‌టికీ అడ్డుప‌డుతున్నార‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. త‌మకు బాస్‌లు ఢిల్లీలో ఉండేవారు కాదని, గ‌ల్లీల్లో ఉండే ప్ర‌జ‌లే త‌మ‌కు బాస్‌లు అని కేటీఆర్ అన్నారు. ఏ స‌ర్వే చేసినా కేసీఆర్ నెంబ‌ర్ 1 ముఖ్య‌మంత్రి అని తేలుతోంద‌ని అన్నారు. రోడ్డుపై ఏనుగు పోతోంటే కుక్క‌లు మొరుగుతుంటాయని వాటిని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని చెప్పారు. కాంగ్రెస్ నాయ‌కులు చేస్తోన్నటువంటి ధ‌ర్నాలు, ఆందోళ‌న‌లను చాలా చూశామ‌ని అన్నారు.

తెలంగాణ ఉద్య‌మంలో తాను జైలుకి కూడా వెళ్లానని తెలిపారు. ఆ రోజు తాము ప్ర‌జ‌ల మ‌ద్దతుతో ఉద్య‌మాలు చేశామ‌ని చెప్పారు. ప‌స‌లేని, ప‌నిలేని ద‌ద్ద‌మ్మ‌ల‌కు తాము జ‌వాబుదారులం కాదని వ్యాఖ్యానించారు. తాము ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే జ‌వాబుదారులమ‌ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తొక్కితేనే బంగారు తెలంగాణ సాధ్యమ‌ని అన్నారు. తెలంగాణ వ‌స్తే విద్యుత్ ఉండ‌ద‌ని ఎద్దేవా చేశారని అన్నారు.  

More Telugu News