new delhi: య‌థావిధిగా జ‌ర‌గ‌నున్న ఎయిర్‌టెల్ ఢిల్లీ హాఫ్ మార‌థాన్‌... స్ప‌ష్టం చేసిన నిర్వాహ‌కులు

  • కాలుష్యం పెరుగుతున్న దృష్ట్యా మార‌థాన్ నిలిపివేయాల‌ని కోరిన ఐఎంఏ
  • సరైన ఏర్పాట్లు చేశామ‌ని తెలిపిన ప్రోకామ్ ఇంట‌ర్నేష‌న‌ల్‌
  • న‌వంబ‌ర్ 19న జ‌ర‌గ‌నున్న‌ మార‌థాన్‌

దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో ఇటీవ‌ల వాయు కాలుష్యం విప‌రీతంగా పెరిగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో, న‌వంబ‌ర్ 19న జ‌ర‌గ‌నున్న ఎయిర్‌టెల్ హాఫ్ మార‌థాన్‌ను నిలిపివేయాల‌ని ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ (ఐఎంఏ) ఢిల్లీ ప్ర‌భుత్వాన్ని కోరింది. అయితే రెండ్రోజులుగా కాలుష్య తీవ్ర‌త త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో హాఫ్ మార‌థాన్‌ను యథావిధిగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు నిర్వాహ‌కులు ప్రోకామ్ ఇంట‌ర్నేష‌న‌ల్ తెలిపింది.

ఐఎంఏ సూచ‌న‌ల‌ను దృష్టిలో ఉంచుకుని మార‌థాన్ జ‌రిగే మార్గంలో అన్ని జాగ్ర‌త్తలు తీసుకుంటున్నామని నిర్వాహ‌కులు తెలిపారు. గాలి కాలుష్యాన్ని త‌గ్గించి, గాలిని పీల్చుకునే వీలుగా మార్చే నెబ్యూలైజ‌ర్ల‌ను మార‌థాన్‌ మార్గంలో ఏర్పాటు చేయ‌నున్నామ‌ని, అందుబాటులో అంబులెన్స్‌లు, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లను కూడా ఉంచ‌నున్న‌ట్లు ప్రోకామ్ ఇంట‌ర్నేష‌నల్ ప్ర‌క‌టించింది. ఈ హాఫ్ మార‌థాన్‌లో విదేశీయుల‌తో క‌లిపి దాదాపు 35,000ల మంది పాల్గొన‌బోతున్నార‌ని తెలిపింది.

More Telugu News