Chiranjeevi: కాలేజీ రోజుల్లో ప్రేమ వ్యవహారాలపై చిరంజీవి స్పందన!

  • బోటనీ లెక్చరర్ పై ఆకర్షణ ఉండేది
  • నా జీవితంలో లవ్, లవ్ లెటర్లు లేవు
  • హీరోయిన్లపై దృష్టి ఉండేది కాదు

కాలేజీ రోజుల్లో కలిగేదాన్ని ప్రేమ అనలేం కాని, ఆకర్షణ అనవచ్చని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఒంగోలులోని శర్మ కాలేజీలో ఇంటర్ బైపీసీ చదువుతున్నప్పుడు బోటనీకి లేడీ లెక్చరర్ ఉండేవారని, ఆమె అంటే తనకు ఒక రకమైన ఆకర్షణ ఉండేదని చెప్పారు. ఆమె పాఠాలు చెప్పే తీరుతోనే తనకు బోటనీపై ఎంతో మక్కువ పెరిగిందని అన్నారు. ప్రాక్టికల్స్ సమయంలో బ్లేడ్ తీసుకుని లీఫ్ కట్ చేసే సమయంలో ఆమె దగ్గరగా వచ్చి చెప్పేవారని, ప్రాక్టికల్స్ ఎంత బాగా చేస్తే మేడమ్ అంత దగ్గరగా వస్తారని భావించే వాడినని చెప్పారు. ఆమె చేత శభాష్ అనిపించుకోవాలని కోరుకునేవాడినని అన్నారు. ఇప్పుడు ఆమె పేరు కూడా గుర్తు లేదని... ఆమె ఫేస్ కూడా గుర్తు లేదని... అన్నీ మర్చిపోయానని చెప్పారు.

ఇంటర్ తర్వాత నర్సాపురంలో బీకాంలో చేరానని... అక్కడున్నవారు తనకు ఫ్రెండ్స్ అయ్యేలోపలే ఫస్ట్ ఇయర్ అయిపోయిందని... ఆ తర్వాత తన ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వల్ల ఎవరితోనూ కలవలేకపోయానని తెలిపారు. ఇంతకు మించి ప్రేమ వ్యవహారాలు, లవ్ లెటర్లు ఇలాంటివేమీ తన జీవితంలో లేవని తెలిపారు. గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఈ విషయాలను చిరంజీవి పంచుకున్నారు.

సినిమాల్లోకి వచ్చిన తర్వాత హీరోయిన్లపై కూడా దృష్టి ఉండేది కాదని... దర్శకులు, నిర్మాతలతో మంచి నటుడు అనిపించుకోవాలనే తపన మాత్రమే ఉండేదని చెప్పారు. ఆ తర్వాత పెళ్లయిపోయిందని తెలిపారు. తన జీవితంలో తన సతీమణి సురేఖ తప్ప ఇంకెవరూ లేరని అన్నారు. చిన్నప్పుడు ఆంజనేయస్వామి భక్తుడిని, ఇప్పుడు సురేఖ భక్తుడినని తెలిపారు. ఫిల్మ్ యాక్టర్ గా రాధిక అంటే తనకు చాలా ఇష్టమని, ప్రొఫెషనలిజం పరంగా సౌందర్య ఇష్టమని చెప్పారు.

More Telugu News