జార్జ్ డ‌బ్ల్యూ బుష్ సీనియ‌ర్ త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడని బ‌య‌టపెట్టిన మ‌రో మ‌హిళ‌

17-11-2017 Fri 10:47
  • ఇప్ప‌టికే బుష్‌పై ఆరుగురు మ‌హిళ‌ల ఆరోపణలు 
  • హార్వీ వీన్‌స్టెయిన్ ఘ‌ట‌న త‌ర్వాత బ‌య‌ట‌ప‌డుతున్న లైంగిక వేధింపుల కేసులు
  • ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కి వ‌స్తున్న మ‌హిళ‌లు

అమెరికా మాజీ అధ్య‌క్షుడు జార్జ్ హెచ్‌ డ‌బ్ల్యూ బుష్ సీనియ‌ర్ త‌న‌ను అస‌భ్యంగా తాకాడంటూ మ‌రో మ‌హిళ ఆరోప‌ణ‌లు చేసింది. ఈమెతో క‌లిపి ఇప్ప‌టికి ఏడుగురు మ‌హిళ‌లు బుష్ మీద ఈ ర‌క‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. బుష్ రెండో సారి ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా డియ‌ర్‌బోన్‌లో ఉన్న‌పుడు త‌న‌తో అధ్య‌క్షుడు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని మిచిగాన్‌కి చెందిన 55 ఏళ్ల మ‌హిళ వెల్ల‌డించింది. అయితే మీడియా స‌మావేశంలో భాగంగా ఫొటో దిగుతుండ‌గా అలా అనుకోకుండా జ‌రిగి ఉంటుంద‌ని తాను అనుకున్న‌ట్లు మ‌హిళ వెల్ల‌డించింది.

అయితే ఇటీవ‌ల 2003 నుంచి 2016 మ‌ధ్య‌కాలంలో త‌మ‌ను లైంగికంగా బుష్ వేధించాడంటూ బ‌య‌టికి చెప్ప‌డంతో త‌న‌కు జ‌రిగిన సంఘ‌ట‌న గురించి పున‌రాలోచ‌న చేసిన‌పుడు బుష్ కావాల‌నే చేసిన‌ట్లు అర్థ‌మైంద‌ని తెలిపింది. `2003-16 మ‌ధ్య కాలంలో బుష్ కురువృద్ధుడ‌వ‌డం వ‌ల్ల ఆయ‌న చేసిన ప‌నిని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. కానీ నాతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన‌పుడు ఆయ‌న మ‌ధ్య‌వ‌య‌స్కుడే` అని ఆ మ‌హిళ చెప్పింది.

 ఈ ఆరోప‌ణ‌లను బుష్ ప్ర‌తినిధి జిమ్ మెక్‌గ్రా కొట్టిపారేశారు. దీనికి ముందు వ‌చ్చిన ఆరోప‌ణ‌లకు బుష్ త‌ర‌ఫున‌ జిమ్ మెక్‌గ్రా క్ష‌మాప‌ణ‌లు కోరిన సంగ‌తి తెలిసిందే. హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్‌స్టెయిన్ త‌మ‌ను వేధించాడంటూ కొంత‌మంది హీరోయిన్లు బ‌య‌ట‌పెట్టిన ద‌గ్గ‌ర్నుంచి ప్ర‌ముఖుల చేతిలో అలాంటి వేధింపులు ఎదుర్కున్న వారంతా ఒక్కొక్క‌రుగా బ‌య‌టికి వ‌స్తున్నారు.