rajasthan: అక్కడ.. ఏకంగా ఏటీఎంనే లేపేశారు!

  • రాజస్థాన్ లోని బుండీ నగరంలో ఏటీఎం చోరీ 
  • విద్యుత్ ఆపేసి, ఏటీఎంను ఎత్తుకెళ్లిపోయారు
  • ఏటీఎంను ట్రాన్స్ పోర్ట్ వాహనంలో తరలించిన వైనం 

దోపిడీ దొంగలు ఏకంగా ఏటీఎంను ఎత్తుకెళ్లిపోయిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... రాజస్థాన్ లోని బుండీ నగరంలో వాకింగ్ కు వెళ్లిన బ్యాంకు ఉద్యోగి ఏటీఎం లేకపోవడాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు వచ్చి బ్యాంకు తెరిచి, సీసీకెమెరాలో రికార్డయిన దృశ్యాలను పరిశీలించారు. ముఖానికి ముసుగులు ధరించిన నలుగురు దుండగులు ముందుగా ఏటీఎం గదిలో విద్యుత్ సరఫరా నిలిపేశారు.

తర్వాత ఏటీఎంను మోసుకుంటూ వెళ్లి, వంద మీటర్ల దూరంలోని ట్రాన్స్ పోర్టు వాహనంలోకి చేర్చారు. అనంతరం దానిని తీసుకెళ్లిపోయారు. ఆ ఏటీఎంలో నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల నగదు ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు. ఆ ఏటీఎంలో సెక్యూరిటీ కాంట్రాక్టు ముగియడంతో దానిని పునరుద్ధరించలేదు. దీనిని అవకాశంగా మలచుకున్న దొంగలు దోపిడీకి తెగబడ్డారు. కాగా, ఈ పరిసరాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించినా ఏటీఎం చోరీని గుర్తించకపొవడం విశేషం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

More Telugu News