Nagarjuna: నేనే నాగార్జునతో మాట్లాడి ఒప్పిస్తా: 'అన్నపూర్ణా స్టూడియోస్ లింక్ రోడ్'పై కేటీఆర్

  • హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించే అన్నపూర్ణ స్టూడియో లింక్ రోడ్
  • ఇప్పటికే 20 అడుగులు వదులుకునేందుకు సిద్ధపడ్డ అక్కినేని ఫ్యామిలీ
  • మరో 20 అడుగుల కోసం మాట్లాడతానన్న కేటీఆర్
  • రూ. 8 కోట్ల అంచనా వ్యయంతో 80 అడుగుల రోడ్డుకు ప్రణాళిక

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గిస్తుందని భావిస్తున్న అన్నపూర్ణా స్టూడియోస్ లింక్ రోడ్డుకు అవసరమైన స్థలం కోసం తాను స్వయంగా హీరో నాగార్జునతో మాట్లాడి ఒప్పిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. కృష్ణానగర్, జవహర్ నగర్, అన్నపూర్ణ స్టూడియోలను ఆనుకుని ఉన్న రోడ్ల మీదుగా వేసే రోడ్డుతో బంజారాహిల్స్ నుంచి అమీర్ పేట, ఎస్ఆర్ నగర్, యూసఫ్ గూడ ప్రాంతాలకు వెళ్లే వారికి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం కలిసొస్తుంది.

ఈ మార్గం కొండ దిగువకు సాగాల్సి వుండటంతో, ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని, కనీసం 80 అడుగుల వెడల్పుతో రోడ్డు వేయాల్సి వుంటుందని అధికారులు తేల్చారు. ఇందుకోసం ఇప్పటికే అన్నపూర్ణా స్టూడియోస్ 20 అడుగల స్థలాన్ని ఇచ్చేందుకు అంగీకరించగా, అది సరిపోయే పరిస్థితి లేదు. స్టూడియో 40 అడుగుల వెనక్కు వెళితేనే ప్రమాదరహిత రహదారి నిర్మాణానికి వీలవుతుందని అధికారులు చెప్పడంతో, తాను స్వయంగా రంగంలోకి దిగుతానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

 ప్రస్తుతం అమీర్ పేట, ఇందిరానగర్, యూసఫ్ గూడ నుంచి బంజారాహిల్స్ వెళ్లాల్సిన వాహనాలకు, అటు నుంచి వచ్చే వాహనాలకు ఈ రహదారి ఏర్పడితే, ఎంతో సమయం కలిసొస్తుంది. ప్రస్తుతం జవహర్ నగర్ వరకూ 40 ఫీట్ల రోడ్డు, ఆపై అన్నపూర్ణ స్టూడియో తరువాత కచ్చారోడ్డు ఉండగా, మొత్తాన్ని కలుపుతూ 80 అడుగుల రహదారిని రూ. 8 కోట్ల అంచనా వ్యయంతో 100 రోజుల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఈ ప్రాంతంలో పర్యటించిన కేటీఆర్ వెల్లడించారు.

More Telugu News