Virat Kohli: నేనేమీ రోబోను కాదు.. నాక్కూడా రెస్ట్ కావాలి: కోహ్లీ

  • నా శరీరం విశ్రాంతిని కోరుకుంటే.. కచ్చితంగా తీసుకుంటా
  • నా చర్మాన్ని కోసినా రక్తమే వస్తుంది
  • పాండ్యాకు విశ్రాంతి అవసరమే

తనకు విశ్రాంతి కావాలని అనిపించినప్పుడు కచ్చితంగా బీసీసీఐని రెస్ట్ కావాలని అడుగుతానని టీమిండియా కెప్టెన్ కోహ్లీ చెప్పాడు. శ్రీలంకతో రేపటి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మీడియాతో కోహ్లీ ముచ్చటించాడు. ఈ సందర్భంగా సెకండ్ టెస్ట్ తర్వాత రెస్ట్ కావాలని బీసీసీఐని కోరినట్టు వచ్చిన వార్తలపై మీడియా ప్రశ్నించగా... తనకు రెస్ట్ కావాలని అనిపించినప్పుడు కచ్చితంగా అడుగుతానని చెప్పాడు. తానేమీ రోబోను కాదని... తన చర్మం, మెడను కోస్తే తనకు కూడా రక్తమే వస్తుందని చెప్పాడు.

తనకు రెస్ట్ కావాలని అనిపించినప్పుడు తానెందుకు రెస్ట్ తీసుకోకూడదని కోహ్లీ ప్రశ్నించాడు. హార్దిక్ పాండ్యా మొదటి రెండు టెస్టులకు రెస్ట్ తీసుకోనుండటంపై స్పందిస్తూ, మైదానంలో ఎక్కువగా కష్టపడేవారికి రెస్ట్ అవసరమని చెప్పాడు. కొందరికి ఈ విషయాలు అర్థం కావని చెప్పాడు. ఆటగాళ్లంతా ఏడాదికి 40 మ్యాచ్ లు ఆడతారని... ఒక్కో ఆటగాడి ఆట ఒక్కో విధంగా ఉంటుందని... క్రీజులో నిలిచే సమయం, వేసే ఓవర్ల సంఖ్య అందరికీ ఒకేలా ఉండదని... ఎక్కువ కష్టపడేవారికి కచ్చితంగా రెస్ట్ అవసరమని అన్నాడు. జనాలు ఈ విషయాలన్నింటినీ పట్టించుకోరని... అందరినీ ఒకే కోణంలోనే చూస్తారని చెప్పాడు. టెస్టుల్లో పుజారాలాంటి ఆటగాళ్లు ఎక్కువ గంటల పాటు క్రీజులోనే ఉంటారని... అటాకింగ్ గేమ్ ఆడే వారిని పుజారాతో ఎలా పోలుస్తామని తెలిపాడు.

ప్రస్తుతం 20 నుంచి 25 మంది ఆటగాళ్లతో కూడిన స్ట్రాంగ్ కోర్ టీమ్ ఉందని... దీంతో, ఆటగాళ్లు రెస్ట్ తీసుకోవడానికి వెసులుబాటు కలగుతుందని కోహ్లీ చెప్పాడు. విశ్రాంతి లేకపోవడం వల్ల కీలకమైన ఆటగాళ్లు కీలకమైన మ్యాచ్ లలో బ్రేక్ డౌన్ కావడాన్ని మీరు కోరుకుంటున్నారా? అంటూ ప్రశ్నించాడు.

More Telugu News