Uber: సీటు బెల్టు విషయంలో గొడవ.. ప్రయాణికుడిని బెల్టుతో చితకబాదిన ఉబెర్ డ్రైవర్లు

  • సీటు బెల్టు కోసం ప్రశ్నించినందుకు గొడవ
  • తోటి డ్రైవర్లతో కలిసి ప్రయాణికుడిపై దాడి
  • కేసును ఎదుర్కొనేందుకు సిద్ధమన్న ఉబెర్

కార్ హైరింగ్ సంస్థ ఉబెర్ డ్రైవర్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. రోజుకో వివాదంలో కూరుకుపోతున్నా ఉబెర్ డ్రైవర్లలో మార్పు కనిపించడం లేదు. తాజాగా బెంగళూరులో ఓ ప్రయాణికుడిని ఉబెర్ డ్రైవర్లంతా కలిసి చితకబాదారు. సీటు బెల్టు విషయంలో వాగ్వాదం పెరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన డ్రైవర్.. మిగతా డ్రైవర్ల సాయంతో ప్రయాణికుడిపై బెల్టుతో దాడి చేశాడు. బెంగళూరు కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ మేరకు బాధితుడైన ఓ ప్రకటనల కంపెనీ యజమాని దేవ్ బెనర్జీ (48) తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై సంస్థకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తనపై దాడి విషయంలో ఇప్పటి వరకు పోలీసులకు ఆయన ఫిర్యాదు చేయలేదు. డ్రైవర్ల దాడిలో గాయపడిన తాను చికిత్స తీసుకుంటున్నానని, త్వరలోనే డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసి సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

ఈ ఘటనపై స్పందించిన ఉబెర్ ఓ ప్రకటన విడుదల చేసింది. తమకు ప్రయాణికుల భద్రతే తమ మొదటి లక్ష్యమని పేర్కొంది. డ్రైవర్-ప్రయాణికుడి మధ్య సత్సంబంధాలనే కోరుకుంటామని తెలిపింది. ఏది ఏమైనా ఈ కేసు దర్యాప్తు విషయంలో సహకరిస్తామని, చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. కాగా, తాను కారెక్కాక వెనక సీట్లో సీటు బెల్టులు కనిపించకపోవడంతో డ్రైవర్‌ను అడిగానని, అతడి నుంచి సమాధానం రాకపోవడంతో మరోమారు ప్రశ్నించినట్టు చెప్పారు. రెండుసార్లు అడిగినా అతడి నుంచి స్పందన లేకపోవడంతో అతడి భుజంపై తట్టి కారు ఆపి లోపలున్న సీటు బెల్టులు ఇవ్వాలని అడిగానని దేవ్ వివరించారు.

అయితే తోటి డ్రైవర్ల సాయంతో అతను తనపై దాడిచేశాడని పేర్కొన్నారు. వారి దాడిలో తనతోపాటు తన సహచరుడు కూడా గాయపడినట్టు దేవ్ తెలిపారు. దాడి జరుగుతుండగా ఉబెర్ ఎస్ఓఎస్ సిస్టం పనిచేయలేదని, తర్వాత సంప్రదిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారని దేవ్ వివరించారు.

More Telugu News