thailand: ఉక్కపోత భరించలేక మూడు ఫ్యాన్లు పెట్టుకుంటే.. ఆ చల్లగాలికి ఏకంగా ప్రాణం పోయింది!

  • ఎండవేడిమికి తట్టుకోలేక మూడు ఫ్యాన్లు పెట్టుకుని నేలపై నిద్రకు ఉపక్రమించాడు 
  • అక్కడ పగలు అధిక ఉష్ణోగ్రతలు.. రాత్రి అతి చల్లని వాతావరణం  
  • రాత్రి ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గిపోవడంతో హైపోథెర్మియాకు గురై మరణించిన సొబ్తావీ

థాయ్‌ లాండ్‌ లో ఉక్కపోతను భరించలేక గాలి కోసం పెట్టుకున్న మూడు ఫ్యాన్లు ఒక వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్న ఘటన విస్మయానికి గురి చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే... థాయ్ లాండ్ లోని చయాఫూమ్‌ ప్రావిన్స్‌ కు చెందిన సొబ్తావీ (44) తాంబాన్‌ ముయాంగ్‌ లోని తల్లి (86)ని చూసేందుకు వెళ్లాడు. ఆ రాత్రి అక్కడే బసచేశాడు. అయితే అక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో మూడు ఫ్యాన్లు పెట్టుకుని నిద్రపోయాడు.

విచిత్రం ఏమిటంటే, ఆ ప్రాంతంలో పగటి పూట బాధించే తీవ్రమైన ఉష్ణోగ్రతలు రాత్రి పూట దారుణంగా పడిపోతుంటాయి. ఈ విషయం తెలియని సొబ్తావీ మూడు ఫ్యాన్లు ఆన్ చేసి నిద్రకు ఉపక్రమించాడు. అయితే రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా చల్లబడిపోవడానికి తోడు, నేలపై పడుకోవడంతో అతని శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. తెల్లవారాక అతని బంధువు వచ్చి అతనిని నిద్రలేపేందుకు ప్రయత్నించగా.. అతని శరీరం పూర్తిగా చల్లబడి ఉండడంతో హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే అతను హైపోథెర్మియా (శరీరం బాగా చల్లబడిపోవడం) తో అతను చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. నవంబర్ 3న చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన సోదరుడు శారీరకంగా దృఢంగా ఉండేవాడని, అతనికి ఎలాంటి అనారోగ్యమూ లేదని సొబ్తావీ సోదరుడు సరవుత్‌ తెలిపాడు. 

More Telugu News