ప్రధాని మోదీ: మనీలాలోని నా చిన్నారి స్నేహితుడికి పోలీసు అవ్వాలని ఉందట: ప్రధాని మోదీ

  • ఫిలిప్పీన్స్ లో పర్యటిస్తున్న భారత ప్రధాని
  • ‘మహవీర్ ఫిలిప్పీన్ ఫౌండేషన్’ సందర్శన
  • తొమ్మిదేళ్ల దివ్యాంగుడు మైజెల్ తో ముచ్చటించిన మోదీ

ఆసియాన్ సదస్సులో పాల్గొనే నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మనీలాలోని ‘మహవీర్ ఫిలిప్పీన్ ఫౌండేషన్’ను సందర్శించి..అక్కడి చిన్నారులతో మోదీ సరదాగా గడిపారు. కాగా, అక్కడ మైజెల్ సిల్వనో అనే తొమ్మిదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. దివ్యాంగుడైన ఆ బాలుడికి జైపూర్ కృత్రిమ కాలును అమర్చారు. మోదీ దృష్టి మైజెల్ పై పడింది.

ఆ బాలుడిని ఆప్యాయంగా పలకరించిన మోదీ, కొంచెం సేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘నాకు పోలీస్ కావాలని ఉంది’ అని తన చిన్నారి స్నేహితుడు తనకు చెప్పాడని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. మైజెల్ సహా దివ్యాంగులైన యువతకు ‘జైపూర్ పాదాలు’ అమర్చడం ద్వారా వారి ఆశలకు రెక్కలు వస్తాయని, దివ్యాంగులతో తాను మమేకమయ్యానని ఆ ట్వీట్ లో మోదీ పేర్కొన్నారు.

మహవీర్ ఫిలిప్పీన్ ఫౌండేషన్ ని సందర్శించడం తనకు చాలా సంతోషంగా ఉందని, దివ్యాంగులకు జైపూర్ పాదాలు అమర్చడం ద్వారా ఎన్నో జీవితాల్లో వారు వెలుగు నింపుతున్నారని పేర్కొన్నారు.

More Telugu News