wasim akram: బీసీసీఐని ఒత్తిడి చేయవద్దు.. ఐసీసీ కూడా ఏమీ చేయలేదు: వసీం అక్రమ్

  • ఇండియాను ఒత్తిడి చేయకపోవడమే మంచిది
  • బీసీసీఐ ఇష్టాన్ని ఐసీసీ కూడా కాదనలేదు
  • ఇండియా-పాక్ ల మధ్య మ్యాచ్ లు ఇచ్చే మజానే వేరు

2015 నుంచి 2023 మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్ లు జరిగే విధంగా బీసీసీఐ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య 2014లో ఒప్పందం కుదిరింది. అయితే, ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడంతో, పాక్ తో క్రికెట్ ఆడకూడదంటూ భారత్ నిర్ణయించింది. భారత్ తీసుకున్న నిర్ణయంతో పాక్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా చాలా నష్టపోయింది. దీంతో, తమతో క్రికెట్ ఆడాల్సిందేనంటూ బీసీసీఐపై పీసీబీ ఎన్నో రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అయినా, బీసీసీఐ మాత్రం ససేమిరా అంటోంది.

ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ స్పందించాడు. భారత్-పాక్ ల మధ్య మ్యాచ్ లు ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటాయని ఆయన చెప్పాడు. అయితే, పాక్ తో ఆడటానికి భారత్ మొగ్గు చూపని పక్షంలో... తమతో ఆడాల్సిందేనంటూ భారత్ పై ఒత్తిడి తీసుకురాకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ వ్యవహారాల్లో తలదూర్చే అధికారం ఐసీసీకి కూడా లేదని చెప్పారు.

 ఈ నేపథ్యంలో, ఇరు బోర్డుల మధ్య అర్థవంతమైన చర్చలు కొనసాగాలని సూచించాడు. క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టకూడదని అన్నాడు. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ కంటే భారత్-పాక్ ల మధ్య జరిగే మ్యాచ్ లే ఎక్కువ మజా ఇస్తాయని అక్రమ్ తెలిపాడు. యాషెస్ సిరీస్ ను 2 కోట్ల మంది మాత్రమే చూస్తారని... అదే భారత్, పాక్ లు ఆడితే 100 కోట్ల మంది అభిమానులు చూస్తారని చెప్పాడు.

మరోవైపు ఇదే విషయంపై ఐసీసీ చీఫ్ డేవ్ రిచర్డ్ సన్ కూడా స్పందించాడు. పాక్ తో ఆడటానికి ఇండియా ఆసక్తి చూపకపోతే... తాము ఏమీ చేయలేమని ఆయన స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సిరీస్ లు రెండు బోర్డుల అంగీకారంతో మాత్రమే జరుగుతాయని చెప్పాడు. 

More Telugu News