weapons: శత్రువులను చీల్చి చెండాడేందుకు సరిపడా ఆయుధాలున్నాయి.. అపోహలొద్దు: భారత ఆర్మీ చీఫ్

  • పది రోజులకు సరిపడా ఆయుధాలే ఉన్నాయన్న ఆరోపణల్లో నిజం లేదు
  • ఆయుధాలను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తున్నాం
  • అమ్ముల పొదిలో అత్యాధునిక ఆయుధాలున్నాయి

శత్రువులను ఎదుర్కొనేందుకు అవసరమైన ఆయుధాలు ఆర్మీ వద్ద చాలినన్ని ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పేర్కొన్నారు. యుద్ధం చేయాల్సి వస్తే ఆర్మీ వద్ద పది రోజులకు మించి ఆయుధాలు లేవన్న ‘కాగ్’ రిపోర్టుపై స్పందించిన రావత్ ఈ మేరకు వివరణ ఇచ్చారు. ఆర్మీ వద్ద ఇప్పటికే తగినన్ని ఆయుధాలు ఉన్నాయని పేర్కొన్న ఆయన, వాటిని ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తున్నట్టు తెలిపారు. టెక్నాలజీతో వాటిని అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు తెలిపారు. వారణాసిలోని 39 గూర్ఖా ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించిన గూర్ఖా రైఫిల్స్ బైసెంటినరీ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ ఏడాది జూలైలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఓ నివేదిక విడుదల చేస్తూ ఆర్మీ వద్ద కేవలం  పది రోజులకే సరిపడ ఆయుధాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నివేదికపై స్పందించిన రావత్ అటువంటిదేమీ లేదని తాజాగా తేల్చిచెప్పారు. శత్రువులను మట్టికరిపించేందుకు అవసరమైన ఆయుధ సంపత్తి తమ వద్ద ఉందని తేల్చి చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో ‘స్టోన్ పెల్టింగ్’ బాగా తగ్గిందని, సాధారణ  పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌లు నిరంతరం కృషి చేస్తున్నాయన్నారు. సమస్య రాత్రికి రాత్రి పరిష్కారం కాదని రావత్ పేర్కొన్నారు.

More Telugu News