ప్రమాదం నుంచి ప్రాణాంతకం... ఢిల్లీలో ఒక రోజుంటే 45 సిగరెట్లు తాగినట్టు... కాలుష్యంలో రికార్డులు బ్రేక్!

10-11-2017 Fri 10:32
  • 999 పాయింట్లకు చేరుకున్న ఏక్యూఐ
  • నగరాన్ని ఆవహించిన మురికి మంచు
  • సరిగ్గా పనిచేయని అధికార యంత్రాంగం
  • శాశ్వత చర్యలు తీసుకోవాలని ఎన్ హెచ్ఆర్సీ హితవు
దేశ రాజధాని ఢిల్లీలో ఒక్క రోజుండి వస్తే, 45 సిగరెట్లు తాగినట్టే. కాలుష్యం ప్రమాదకరం, అత్యంత ప్రమాదకర స్థాయులను దాటేసి, ప్రాణాంతక స్థాయికి చేరుకుంది. వాయునాణ్యత సూచి (ఏక్యూఐ) లో 100 పాయింట్లు దాటితేనే డేంజర్ అని చెప్పుకునే పరిస్థితుల్లో ఏక్యూఐ 999కు చేరుకుంది. ఇంత కాలుష్యమున్న గాలిని పీల్చడం ప్రాణాలను హరిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కనీసం మరో రెండు రోజుల పాటు ఇదే విధమైన వాయు కాలుష్యం ఢిల్లీలో ఉంటుందని కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు జారీ చేసింది. నగరమంతా మురికి మంచు ఆవహించగా, రహదారులపై పట్టుమని పది కిలోమీటర్ల వేగంతో కూడా ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది. కాలుష్య నియంత్రణకు అధికారయంత్రాంగం సరిగ్గా పనిచేయడం లేదని మానవ హక్కుల కమిషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

ఎవరి చావు వారు చావాలన్న చందంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ, కేంద్రప్రభుత్వం సహా ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు నోటీసులు పంపింది. గతంలో లండన్ అనుభవించిన నరకం ఇప్పుడు ఢిల్లీని బాధిస్తోందని, తాత్కాలిక ఉపశమన మార్గాలు కాకుండా, శాశ్వత పరిష్కారం ఆలోచించాలని సూచించింది.