world gold council: ఇండియాలో బంగారం కొనడం తగ్గింది... జూలై తరువాత 24 శాతం తగ్గిన ఇంపోర్ట్!

  • 193 టన్నుల నుంచి 146 టన్నులకు తగ్గిన దిగుమతి
  • జీఎస్టీ, మనీ ల్యాండరింగ్ చట్టాలతో భయపడుతున్న కస్టమర్లు
  • వచ్చే సంవత్సరం మాత్రం అమ్మకాలు పుంజుకునే చాన్స్
  • అంచనా వేస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్

ప్రపంచంలో అత్యధికంగా ప్రజల నుంచి బంగారం కొనుగోలు జరిగే ఇండియాలో విక్రయాలు తగ్గాయి. గడచిన జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం దిగుమతి 2015-16తో పోలిస్తే ఏకంగా 24 శాతం తగ్గి 145.9 టన్నులకు మాత్రమే పరిమితమైంది. ఈ సంవత్సరం బంగారానికి అతి తక్కువ డిమాండ్ సెప్టెంబర్ క్వార్టర్ లోనే కనిపించిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వ్యాఖ్యానించింది.

ఈ ఏడాది మొత్తం మీద 650 నుంచి 759 టన్నుల మధ్య బంగారం దిగుమతి ఉండవచ్చని, వచ్చే సంవత్సరం మాత్రం ఇంపోర్ట్ పెరుగుతుందని భావిస్తున్నామని పేర్కొంది. జీఎస్టీ అమలులోకి రావడం, పాన్ సంఖ్య వెల్లడి, మనీ ల్యాండరింగ్ వ్యతిరేక చట్టం తదితరాల కారణంగా గోల్డ్ సేల్స్ విషయంలో కస్టమర్లు ఆచి తూచి అడుగులు వేస్తున్నారని డబ్ల్యూజీసీ పేర్కొంది.

గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో 193 టన్నులుగా ఉన్న బంగారం దిగుమతి, ఈ సంవత్సరం 145.9 టన్నులకే పరిమితం కావడానికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కూడా కారణమని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారత ఎండీ సోమసుందరం అన్నారు. శుద్ధి నిమిత్తం వచ్చిన పాత బంగారం మొత్తం సైతం గణనీయంగా తగ్గిందని, పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటున్న వారి సంఖ్య కూడా తగ్గిందని ఆయన తెలిపారు.

గత సంవత్సరం 40.1 టన్నుల మేరకు గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్స్ జరుగగా, ఈ సంవత్సరం అది 31 టన్నులకు పడిపోయిందని తెలిపారు. ప్రస్తుతం దిగజారిన జీడీపీ, వచ్చే సంవత్సరం నుంచి పెరగడం ప్రారంభమవుతుందని, జీడీపీతోనే బంగారానికి డిమాండ్ కూడా పెరుగుతుందని భావిస్తున్నామని సోమసుందరం వ్యాఖ్యానించారు.

కాగా, ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగానూ అమ్మకాలు తగ్గినట్టు గణాంకాలు చూపిస్తున్నాయి. యూఎస్ లో గోల్డ్ ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్) విభాగానికి వస్తున్న నిధుల మొత్తం తగ్గింది. చైనా కరెన్సీ విలువ పడిపోవడం కూడా బంగారంపై ప్రభావం చూపించిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News