Mars: నేను మార్స్ మీద పుట్టా.. అప్పట్లో ఓసారి భూమిపైకి వచ్చా.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న రష్యన్ యువకుడు!

  • మనుషులను రక్షించేందుకే భూమిపై పుట్టానంటున్న బోరిస్కా
  • మార్షియన్లకు చావు లేదని వ్యాఖ్య
  • వారి సాంకేతికత మానవులకు అందదన్న యువకుడు

తాను భూమి మీద జన్మించడానికి ముందు అరుణగ్రహం (అంగారకుడు)పై పుట్టినట్టు చెబుతున్నాడు రష్యాలోని వోల్గోగ్రాడ్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు బోరిస్కా కిప్రియానోవిచ్. అక్కడి విశేషాలు, జీవన విధానాలను చెబుతూ శాస్త్రవేత్తలను సైతం అబ్బురపరుస్తున్నాడు. మరికొందరితో కలిసి తాను అప్పట్లో భూమికి వచ్చినట్టు చెప్పాడు. ప్రస్తుతం తాను మనుషులను రక్షించేందుకు మరికొందరితో కలిసి భూమిపై జన్మించినట్టు చెబుతున్నాడు.

బోరిస్కా చిన్నప్పటి నుంచే అద్భుతాలు చేస్తున్నాడని వైద్యురాలైన అతడి తల్లి తెలిపింది. జన్మించిన కొన్ని నెలలకే తానెప్పుడూ ఊహించని విషయాల గురించి తనతో చర్చించేవాడని తెలిపారు. గ్రహాంతర నాగరికత గురించి తనకు చెప్పేవాడని వివరించారు. రెండేళ్ల వయసులోనే బోరిస్కా రాయడం, చదవడాన్ని చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారన్నారు.  

బోరిస్కా మాట్లాడుతూ చాలా ఏళ్ల క్రితం మార్స్‌పై పెద్ద అణు విస్పోటనం జరిగిందని గుర్తు చేసుకున్నాడు. అంగారకుడిపై నివసించే మార్షియన్లు (మార్స్‌పై నివసించే వారు) ఏడడుగుల ఆజానుబాహులని పేర్కొన్నాడు. వారంతా ఇప్పటికీ అక్కడి అండర్‌ గ్రౌండ్‌లో నివసిస్తున్నారని, కార్బన్ డయాక్సైడ్ పీలుస్తారని వివరించాడు. వారు అమరులని, 35 ఏళ్లతో వయసు ఆగిపోతుందని, ఆ తర్వాత వారి శరీరంలో ఎటువంటి మార్పులు సంభవించవన్నాడు. టెక్నాలజీ విషయంలో మానవుల కంటే వారు చాలా ముందున్నారని, నక్షత్రాల మధ్య ప్రయాణించే సాంకేతికత వారి సొంతమన్నాడు.

పురాతన ఈజిప్షియన్లతో వారికి సన్నిహిత సంబంధాలు ఉండేవని పేర్కొన్న బోరిస్కా తాను పైలట్‌గా ఓసారి భూమికి కూడా వచ్చానని తెలిపాడు. గిజా పట్టణంలోని గ్రేట్ స్ఫింక్స్ కట్టడాన్ని కనుక ఓపెన్ చేస్తే భూమి మీద జీవన శైలిలో నాటకీయ మార్పు సంభవిస్తుందని పేర్కొన్నాడు. ఆ పిరమిడ్‌ను తెరిచే మెకానిజం దాని చెవి వెనకే ఉందని వివరించాడు.  అంతేకాదు.. మార్స్ మీద జీవనం, అక్కడి స్థితిగతులపై బొమ్మలు సైతం వేసి చూపిస్తూ శాస్త్రవేత్తలకే ఆసక్తి కలిగిస్తున్నాడు.

More Telugu News